ఏపీలో ప్రైవేటు చేతికి భూముల రిజిస్ట్రేషన్లు ? తేల్చేసిన ప్రభుత్వం..!
ఏపీలో కూటమి సర్కార్ (AP Govt) ఈ రెండేళ్లలో చాలా అంశాల్లో ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతోంది. ఖజానా ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ఖర్చు తగ్గించుకునేందుకు ఇలా మెడికల్ కాలేజీలు, పోర్టులు సహా పలు అంశాల్లో ప్రైవేటీకరణ బాట పడుతోంది. ఇదే క్రమంలో భూముల రిజిస్ట్రేషన్ (Land Registrations) ప్రక్రియను సైతం ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్నట్లు తాజాగా ప్రచారం మొదలైంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్, అడ్వాన్స్ స్లాట్ బుకింగ్, ఇంటిగ్రేటెడ్ పేమెంట్ వంటి సేవల్ని ఏకీకరణ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ ప్రైవేటీకరణపై స్పష్టత ఇచ్చింది.
భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటు వారికి అప్పగిస్తున్నట్లు సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా సత్యదూరమని ప్రభుత్వం తేల్చిచెప్పేసింది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్, అడ్వాన్స్ స్లాట్ బుకింగ్, ఇంటిగ్రేటెడ్ పేమెంట్, సమయపాలనతో సేవలు, పారదర్శకత, టెక్నాలజీ ఆధారిత సేవలన్నీ ఒకే కేంద్రంలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని సంబంధిత వర్గాల వారు హర్షిస్తుండగా రాజకీయ దురుద్దేశంతో అసత్యాలను ప్రచారం చేయడం సబబు కాదని తెలిపింది. జిల్లాకు ఒక రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుకల్పించే జీవో నెంబర్ 396 పై అపోహలు రేకెత్తించడం దురదృష్టకరమని పేర్కొంది.

రిజిస్ట్రేషన్ ముందు చేయాల్సిన పేపర్ వర్క్ సహా అన్ని సేవలు ఒకేచోట లభించేలా పాస్ పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఉంటాయని తెలిపింది.ఇప్పటికే మహారాష్ట్రలో ఈ విధానం అమల్లో ఉందని, రిజిస్ట్రేషన్ అధికారాలు, నిర్ణయాధికారం, చట్టబద్ధ బాధ్యతలన్నీ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖకే చెందుతాయని పేర్కొంది. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన చట్టబద్ధమైన ప్రక్రియ, పత్రాల పరిశీలన, అర్హత నిర్ధారణ, నమోదు, ఆమోదం, డిజిటల్ సంతకం, రిజిస్ట్రేషన్, పత్రాల విడుదల అన్నీ సబ్-రిజిస్ట్రారే నిర్వహిస్తారని క్లారిటీ ఇచ్చింది. "Statutory control over registration functions remains firmly with the Department" అని జీవోలో స్పష్టంగా ఉన్నట్లు గుర్తుచేసింది. ఇది సింగిల్ విండో తరహాలో సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ఉద్దేశించిన సంస్కరణ మాత్రమేనని తెలిపింది. ప్రైవేటీకరణ అనేది దుష్ప్రచారమే అని తెలిపింది. అసత్యాలు ప్రచారం చేస్తున్నసోషల్ మీడియాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications