స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల ఖరారు - ఏ పార్టీకి ఎన్ని, ఇదీ ఫార్ములా..!!
ఏపీలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్దం అవుతోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ముందుగా కూటమి పార్టీల సమన్వయం పైనా ఫోకస్ చేసారు. సీట్ల కేటాయింపు పైన ఒక ఫార్ములా సిద్దం చేసారు. కూటమి పార్టీల్లోని కేడర్ క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేసి.. ఏకపక్షంగా విజయం సాధించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ముందుగా మున్సిపల్.. ఆ తరువాత పంచాయితీ ఎన్నికల దిశగా కసరత్తు కొనసాగుతోంది.
ఏపీలో స్థానిక ఎన్నికల పైన కూటమి కసరత్తు మొదలు పెట్టింది. క్షేత్ర స్థాయిలో మూడు పార్టీల కేడర్ ను ఇందుకు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే సీఎం చంద్రబాబు పార్టీ కేడర్ కు సెప్టెంబర్ నుంచి ఎప్పుడైనా స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని.. ఇప్పటి నుంచే సిద్దం కావాలని సూచించారు. తాజాగా మూడు పార్టీల నేతలు సమావేశం అయి.. సమన్వయం పైన చర్చ చేసారు. వచ్చే వారం మూడు పార్టీల నుంచి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. అదే విధంగా మండల స్థాయిలోనూ కమిటీల దిశగా ఆలోచన చేస్తున్నారు. అయితే, స్థానిక ఎన్నికలకు సహజంగానే పోటీ ఎక్కువగా ఉంటుంది. దీంతో.. ముందుగానే పార్టీలకు సీట్లు.. పోటీ పైన నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

సీట్ల పంపకాల పై కొత్త ఫార్ములా
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల సీటు షేరింగ్.. పోటీ పైన ఒక ఫార్ములా సిద్దం చేసారు. ఈ మేరకు 80:15:5 నిష్పత్తిలో సీట్ల సర్దుబాటు ఉంటుందని, టీడీపీ 80 శాతం సీట్లు, జనసేన 15 శాతం, బీజేపీ 5 శాతం సీట్లలో బరిలోకి దిగుతాయని.. స్థానిక పరిస్థితులను బట్టి సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు జరుగుతాయని.. చివరిగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా.. ఎన్నికలకు ముందుగానే కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఈ నెల 27 నుంచి 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం చేపట్టాలని పార్టీ శ్రేణులను అధిష్ఠానం ఆదేశించింది. ఈ కార్యక్రమాన్ని 45 రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించారు.













Click it and Unblock the Notifications