CJP: ఢిల్లీలో ఆగని రచ్చ- అభిజిత్ దిప్కే నిర్బంధం-కాక్రోచ్ నేతలతో నడ్డా చర్చలు..!
పోటీ పరీక్షల వివాదాలకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఇవాళ పార్లమెంట్ మార్చ్ కు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఇచ్చిన పిలుపుతో వేలాది మంది ఢిల్లీని దిగ్బంధించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు.. కాక్రోచ్ నేతల్ని, వారికి మద్దతుగా తరలి వస్తున్న విద్యార్ధుల్ని ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఎక్కడ చూసినా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది.
మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దిప్కే(Abhijeet Dipke)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళే నిరాహారదీక్ష విరమించిన దిప్కేను అనంతరం పార్లమెంట్ మార్చ్ లోకి వెళ్లకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 21 రోజుల పాటు నిరాహారదీక్ష చేసి ప్రస్తుతం సప్ధర్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ను సైతం అక్కడే హౌస్ అరెస్టు చేశారు. అలాగే ఢిల్లీ రూడ్లపై భారీగా గుమికూడిన విద్యార్ధుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీలు చేయడంతో పాటు బాష్పవాయువు గోళాల్ని సైతం ప్రయోగిస్తున్నారు.

ఇంకోవైపు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాకు చర్చలకు రావాలని అపాయింట్ మెంట్ ఇచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా వారిని రెండు గంటల పాటు వెయిట్ చేయించి తనను కలిసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో జేపీ నడ్డాను కలిసిన సౌరవ్ దాస్, అశుతోష్ రాంగా తమ డిమాండ్లపై వినతిపత్రం ఇచ్చారు. అయితే కేవలం 10 నిమిషాల పాటు మాత్రమే వారితో చర్చించి నడ్డా వెనక్కి పంపేశారు. తమ డిమాండ్ల విషయంలో జేపీ నడ్డా పార్టీ నాయకత్వంతో అంతర్గతంగా చర్చిస్తున్నారని అశుతోష్ వెల్లడించారు. మరోవైపు ఢిల్లీలో తమ నాయకుడు దిప్కేతో పాటు భారీ ఎత్తున విద్యార్ధుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై కాక్రోచ్ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ఢిల్లీ పోలీసులు కఠినమైన బలప్రయోగాన్ని తక్షణమే ఆపాలని అశుతోష్ డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications