టీలో చివరి రోజు జోరు: నామినేషన్ల ప్రక్రియ పూర్తి
హైదరాబాద్: లోకసభ, శాసనసభ ఎన్నికల కోసం తెలంగాణలో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. బుధవారం సాయంత్రం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు బుధవారం పెద్ద యెత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల జాబితా వెల్లడిలో అన్ని రాజకీయ పార్టీలు జాప్యం చేయడం, బుధవారం మంచి రోజు కావడంతో పెద్ద యెత్తున నామినేషన్లు దాఖలయ్యాయి.
తెలంగాణలో 17 లోకసభ స్థానాలు, 119 శాసనసభా స్థానాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు బుధవారంనాడు గజ్వెల్ శాసనసభా స్థానానికి, సిద్దిపేట లోకసభ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. ఆయన కూతురు కవిత, కాంగ్రెసు అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ నిజామాబాద్ లోకసభ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్‌నగర్ లోకసభ స్థానానికి కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి నామినేషన్ వేశారు.

మెదక్ శానససభా స్థానానికి కాంగ్రెసు అభ్యర్థిగా విజయశాంతి నామినేషన్ దాఖలు చేశారు. తెరాస నాయకుడు హరీష్ రావు సిద్దిపేట శాసనసభా స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ లోకసభ స్థానానికి మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, శాసనసభా స్థానానికి అక్బరుద్దీన్ ఓవైసీ బుధవారంనాడే నామినేషన్లు దాఖలు చేశారు.
చేవెళ్ల లోకసభ స్థానం నుంచి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి నామినేషన్ వేశారు. మల్కాజిగిరి లోకసభ స్థానానికి తెరాస అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావు నామినేషన్ దాఖలు చేశారు. టిడిపి అభ్యర్థిగా మల్లారెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మాజీ డిజిపి దినేష్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ బుధవారంనాడే అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి.
నల్లగొండ జిల్లా భువనగిరి లోకసభ స్థానానికి కాంగ్రెసు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బిజెపి నుంచి నల్లు ఇంద్రసేనా రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్ లోకసభ స్థానానికి సిరిసిల్ల రాజయ్య (కాంగ్రెసు), కడియం శ్రీహరి (తెరాస) నామినేషన్లు దాఖలు చేశారు.
రేపు (గురువారం) ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 12వ తేదీ వరకు గడువు ఉంది. కాగా, పోలింగ్ 30వ తేదీన జరుగుతుంది. మే 16వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.












Click it and Unblock the Notifications