ముందుకు కదలని నైరుతి రుతుపవనాలు: ఏపీకి ఆలస్యంగానే, మరికొద్ది రోజులు వేడి పరిస్థితులే
అమరావతి: నైరుతి రుతుపవనాల కదలికలు మందగించాయి. రాష్ట్ర రైతులు, ప్రజలంతా ఎదురు చూస్తున్నా.. రుతుపవనాలు ముందుకు కదలడంలేదు. జూన్ 4వ తేదీనే రాయలసీమను తాకాల్సి ఉన్నా కర్ణాటకలోనే కదలకుండా స్థిరంగా ఉండిపోయాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన నాలుగైదు రోజుల్లో ఏపీలోకి ప్రవేశిస్తాయి.

కర్ణాటక-ఏపీ సరిహద్దులోనే ఆగిపోయిన రుతుపవనాలు
ఈ సంవత్సరం మూడు రోజుల ముందుగానే మే 29వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. అక్కడి నుంచి వేగంగా కదిలి జూన్ జూన్ 2వ తేదీకి కర్ణాటక, ఏపీ సరిహద్దు వరకు వచ్చాయి. అప్పటి నుంచి కార్వార్, చిక్ మంగుళూరు ,బెంగుళూరు, ధర్మపురి ప్రాంతంలోనే కదలకుండా ఉండిపోయాయి. ఉపరితల ద్రోణి, పశ్చిమ గాలుల ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మన రాష్ట్రం వైపు కదలడం లేదని నెల్లూరు వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆలస్యంగానే ఏపీకి నైరుతి రుతుపవనాలు
అయితే, బుధవారం కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఏపీలో వేడి పరిస్థితులే..
ఈ క్రమంలో అప్పుడప్పుడు వర్షాల కురిసినా.. ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. రుతు పవనాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడప్పుడే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఏపీ ప్రజలు మరికొద్ది రోజులు ఎండతీవ్రతను ఎదుర్కోనున్నారు. పంటలు వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు కూడా నైరుతి రుతుపవనాలు వచ్చి వర్షాలు కురుస్తాయని ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications