ఈ మూడు రోజులు.. తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు దొరకవ్
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల.. ఓ అరుదైన ఘట్టానికి వేదిక కానుంది. ఈ కలియుగ వైకుంఠంలో ఓ మినీ బ్రహ్మోత్సవం జరుగనుంది. ఒకే రోజున శ్రీవారు సప్త వాహనాలపై ఊరేగనున్నాడు. బ్రహ్మోత్సవ సమయంలో నిర్వహించే వాహనసేవలన్నీ కూడా ఒకేరోజున భక్తుల ముందు సాక్షాత్కారం కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన స్ఫూర్తితో జనవరి 25వ తేదిన జరగనున్న రథ సప్తమిని కూడా అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రథ సప్తమి రోజున శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులు, క్యూలైన్లు, బయట ప్రాంతాల్లో నిరంతరాయంగా భక్తులకు అన్న ప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

రథసప్తమి నాడు అదనంగా అయిదు లక్షల లడ్డూలను బఫర్ స్టాక్ గా నిల్వ ఉంచుకోవాలని అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా, పోలీసులు, టీటీడీ భద్రత సిబ్బంది సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పారు. చక్రస్నానం సందర్భంగా పుష్కరిణి ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
వాహన సేవల వివరాలు:
• తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు)- సూర్యప్రభ వాహనం.
• ఉదయం 9 నుంచి 10 గంటల వరకు- చిన్నశేష వాహనం.
• ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు- గరుడ వాహనం.
• మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు- హనుమంత వాహనం.
• మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు- చక్రస్నానం.
• సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు- కల్పవృక్ష వాహనం.
• సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు- సర్వభూపాల వాహనం.
• రాత్రి 8 నుంచి 9 గంటల వరకు- చంద్రప్రభ వాహనం.
ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు
• కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు.
• ఎన్నారైలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాల రద్దు.
• తిరుపతిలో 24, 25, 26వ తేదీల్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు.
• ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు, బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించదు.












Click it and Unblock the Notifications