చొక్కా విప్పిన మంత్రి సురేష్.. యర్రగొండపాలెంలో ఉద్రిక్తత
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలుగుదేశం, వైసీపీ మధ్య ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను అదుపు చేశారు. చంద్రబాబునాయుడి రోడ్ షో ను అడ్డుకుంటామని వైఎస్సార్ సీపీ ప్రకటించింది. మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు రోడ్డెక్కారు. టీ షర్లు, నల్ల బెలూన్లు ధరించి బాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా మంత్రి సురేష్ కార్యాలయం వైపు దూసుకువచ్చారు. ఆదిమూలపు సురేష్ రోడ్డుపై తన షర్ట్ ను విప్పేసి చంద్రబాబుపై ఆగ్రహంతో మాట్లాడారు. ఇరువర్గాలను పోలీసులు అదుపు చేసినప్పటికీ ఎన్ఎస్‌జీ అప్రమత్తమైంది. చంద్రబాబుకు మరింత భద్రతను పెంచింది. నిఘా వర్గాల హెచ్చరికలతోనే ఎన్ఎస్జీ భద్రత పెంచినట్టు తెలుస్తోంది. చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని, దళితులను అవమానించిన బాబూ కొడుకులకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత లేదన్నారు.

దళితులుగా పుట్టాలనిఎవరైనా అనుకుంటారా అంటూ చంద్రబాబు అవహేళన చేశారని, ఇప్పుడు దళితుల ఓట్ల కోసం ప్రేమ ప్రదర్శిస్తున్నారని మంత్రి సురేష్ ఆరోపించారు. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ సీనియర్ నేత మన్నె రవీంద్రను పోలీసులు అడ్డుకోవడంతోపాటు అదనపు బలగాలను రప్పించారు. మార్కాపురం పర్యటన పూర్తి చేసిన చంద్రబాబు.. ఎర్రగొండపాలెంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. 'ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి' పేరిట నిర్వహించనున్న బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన కడప జిల్లా పర్యటనతోపాటు మార్కాపురం పర్యటనను పూర్తిచేసుకున్నారు. యర్రగొండపాలెం, గిద్దలూరులో రోడ్ షాలో నిర్వహించడానికి పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్న ఎన్ఎస్ జీతోపాటు పోలీసులు కూడా అదనంగా బలగాలను రప్పించి మొహరింప చేశారు.












Click it and Unblock the Notifications