చంద్రబాబుకు షాక్: పవన్ కళ్యాణ్ ప్రశంసలో రాజకీయం ఉందా?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం (2019) ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? అంటే కావొచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన ఏం చేస్తారనేది సస్పెన్స్ అని చెప్పవచ్చు.
ఆయన అన్నయ్య చిరంజీవికి అండగా నిలబడతారా? లేక గత ఎన్నికల్లో వలె టిడిపి - బిజెపి కూటమికి అండగా నిలబడతారా? లేక ఒంటరిగా పోటీ చేస్తారా? కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి చిరంజీవి అయితే, ఒంటరిగా పోటీ చేసి అన్నయ్యకు సహకరిస్తారా? అనే అంశాలు అప్పుడే చర్చనీయాంశమయ్యాయి.
ఇదిలా ఉండగా, ఇటీవల పవన్ కళ్యాణ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ చర్చనీయాంశమవుతోంది. ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు పైన ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్‌కు ఎవరూ సాటి రారని, ఆయన లాంటి నటులు ఎవరూ లేరని, ఆయనకు ఆయనే సాటి అని చెప్పారు.

ఎన్టీఆర్‌ను పవన్ కళ్యాణ్ పొగడటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఆయన రాజకీయ కారణాలతో వ్యాఖ్యానించారా? రానున్న ఎన్నికల నాటికి ఎన్టీఆర్ అభిమానులను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నమా? అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అయితే, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే పవన్ కళ్యాణ్ వాటిని.. మనస్ఫూర్తిగానే చేశారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు, రాజకీయాలకు లింక్ పెట్టరని, రాజకీయ అవసరాల కోసం పొగడాల్సిన అవసరం లేదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు.
ఇదిలా ఉండగా, ఏదేమైనా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా ఆయనకు కొంతమేలు చేసేవేననే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొత్త రాష్ట్రం అయినందున గత ఎన్నికల్లో అనుభవం నేపథ్యంలో చంద్రబాబుకు మద్దతు పలికారు.
వచ్చ ఎన్నికల నాటికి చంద్రబాబు పాలన పట్ల అసంతృప్తి ఏర్పడినా, మరే కారణమైనా ఆయన టిడిపికి మద్దతుగా నిలబడకుంటే.. ఎన్టీఆర్‌ను అభిమానించే, బాబును వ్యతిరేకించే వారు జనసేన అధినేత వైపు ఉంటారని అప్పుడే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications