వీడియో: విజయవాడకు మళ్లీ వరదపోటు: బ్యారేజీ గేట్లు ఎత్తివేత
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల ఇటీవలే ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి- దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలను ముంచెత్తాయి. చెరువులు, కుంటలు వరదనీటితో పోటెత్తాయి. కొత్త నీటితో కళకళలాడుతున్నాయి.
దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు దంచికొట్టాయి.

అటు కర్ణాటక, తెలంగాణల్లో ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఎగువ తీర పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల కృష్ణమ్మ మళ్లీ వరద తాకిడికి గురైంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తెలంగాణలో ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ నిండిపోయింది.
ఏపీలో శ్రీశైలం, పులిచింతల, నాగార్జున సాగర్ రిజర్వాయర్లు వరద నీటితో పోటెత్తాయి. నిండుకుండలా మారాయి. ఫలితంగా శ్రీశైలం రిజర్వాయర్ గేట్లను ఎత్తారు జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులు. నాలుగు గేట్లను 10 అడుగులు మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తోన్నారు.
జూరాల నుంచి 1,18,464, సుంకేసుల నుంచి 72,114 క్యూసెక్కుల మేర నీటి ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. దిగువన ఉన్న నాగార్జున సాగర్ జలాశయం కూడా వరద నీటితో గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరుకుంటోంది. శ్రీశైలం నుంచి విడుదల చేస్తోన్న వరద నీటి వల్ల ఇన్ ఫ్లో భారీగా ఉంటోంది. దీనితో 18 గేట్లు ఎత్తారు. అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తోన్నారు.
ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 20, 2024
కృష్ణా వరద ప్రవాహం స్వల్పంగా పెరగడంతో ప్రకాశం బ్యారేజి వద్ద 1.18 లక్షల క్యూసెక్కుల నీటిని
దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నది దాటే ప్రయత్నాలు చేయరాదు.
~ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. pic.twitter.com/sVH20OpWZm
దీని ప్రభావం ప్రకాశం బ్యరేజీపై పడింది. ఇన్‌ఫ్లో భారీగా ఉంటోంది. దీనితో ప్రకాశం బ్యారేజీకి చెందిన 70 గేట్లను అధికారులు కొద్దిసేపటి కిందటే ఎత్తివేశారు. 1.18 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తోన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నదిని దాటే ప్రయత్నాలు చేయకూడదని సూచించింది.












Click it and Unblock the Notifications