కాల్‌మనీ దందా: పోలీసుల అదుపులో మల్లాది విష్ణు అనుచరుడు ఒగ్గు విక్కీ
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ దందాకు సంబంధించి కల్తీ మద్యం కేసులో ఏ9వ నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణు ప్రధాన అనుచరుడు ఒగ్గు విక్కీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు.
ఒగ్గు విక్కీ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు కాల్‌మనీ ఘటనకు సంబంధించి విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఒగ్గు విక్కీతోపాటు మల్లాది విష్ణు అనుచరుడిగా భావిస్తున్న గణేష్ అనే వ్యక్తి రూ.లక్ష ఇచ్చి, అందుకు బదులుగా తమ వద్ద మూడు నాలుగు లక్షల రూపాయలు వసూలు చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గణేష్ తమ ఇంటిని కూడా లాక్కున్నాడని ఫిర్యాదు చేశారు. ఆమె విలేకరుల ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. కల్తీ మద్యం కేసులో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బెజవాడలో కలకలం రేపిన కాల్ మనీ వ్యవహారంలోనూ ఆయన వర్గం ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది.
కృష్ణలంకలోని స్వర్ణబార్‌లో మద్యం సేవించిన కారణంగానే ఐదుగురు చనిపోగా, 29 తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. స్వర్ణబార్ మల్లాది విష్ణు తమ్ముడి పేరుమీద ఉండటం, ఆయన తల్లి బాల త్రిపుర సుందరమ్మకు వాటా ఉన్న నేపథ్యంలో వారి పేర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును 9వ నిందితుడిగా పోలీసులు ఏఫ్ఐఆర్‌లో చేర్చారు.
ఆ మరుక్షణం నుంచే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మల్లాది విష్ణు ఇప్పటి వరకు పోలీసులకు చిక్కలేదు. ఈ కల్తీమద్యం ఘటనకు సంబంధించి మల్లాది విష్ణు సోదరుడు మల్లాది శ్రీనివాస్ అలియాస్ బుల్లయ్యను సిట్ బృందం అదుపులోకి తీసుకుని విష్ణు ఆచూకీపై ప్రశ్నించింది.
కాగా మల్లాది విష్ణుని ఎలాగైనా అరెస్ట్ చేయాలన్న భావనతో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు మల్లాది విష్ణుకు షల్టర్ ఇచ్చినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి ప్రత్యేక బృందం హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లింది. మరోవైపు మల్లాది విష్ణుకు సంబంధించిన సెల్ ఫోన్ కాల్స్ ఒరిస్సాలోని కటక్ నుంచి వచ్చినట్లు విశ్వసమీయ సమాచారం మేరకు మరో బృందం రెండు రోజుల క్రితమే అక్కడికి బయల్దేరి వెళ్లింది.
ప్రస్తుతం మల్లాది విష్ణు కోసం పోలీసులు గాలింపును మరింత ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications