కెసిఆర్ ప్రమాణానికి భద్రత: ఖరారు కాని బాబు టైమ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జూన్ 2న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో నగరంలో భద్రతపై పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.
నగరంలోని ముఖ్య కూడళ్లు, పరేడ్ గ్రౌండ్స్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సమీక్షలో నిర్ణయించారు. జూన్ 1న అర్ధరాత్రి నుంచి జరుగనున్న ఉత్సవాలకు కూడా పోలీసులు భద్రత కల్పించనున్నారు. జూన్ 2న ఉదయం రాజ్‌భవన్‌లో కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో ఇదే రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలను కూడా జరుపనున్నారు. కాగా, తెలంగాణ గరవ్నర్‌గా జూన్ 2న ఉదయం 6.30కి ఈఎస్ఎల్ నర్సింహన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తంపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. గురువారం చంద్రబాబు నాయుడుతో కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ నేతలు భేటీ అయ్యారు. జూన్ 8న మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వల్ల ఎండవేడిమికి ప్రజలు, నాయకులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని పార్టీ నేతలు చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది.
జూన్ 8న రాత్రి 7 గంటలకు కూడా మంచి ముహూర్తం ఉందని నేతలు బాబుకు చెప్పారు. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై వారు చంద్రబాబుతో చర్చించారు. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ఎన్డీఏ పెద్దలను ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించాలని చంద్రబాబుకు ప్రతిపాదించారు.












Click it and Unblock the Notifications