వారిద్దరికీ ఎదురే లేదు?
చంద్రబాబునాయుడిపై, లోకేష్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ వీరిద్దరూ వైసీపీలో బాగా ప్రాచుర్యం పొందారు
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత పట్టుదలతో ఉందో తెలుగుదేశం పార్టీ కూడా అంతే పట్టుదలతో ప్రణాళికలు రచిస్తోంది. వైసీపీ నుంచి ప్రత్యేకంగా కొంతమందిని టార్గెట్ గా పెట్టుకొని వారిని ఓడించాలనే యోచన చేస్తోంది. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితోపాటు ఆయన తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై నిరంతరం విరుచుకుపడుతున్నవారిని ఓడించాలనే భావనతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కసిగా ఉన్నారని చెప్పవచ్చు.

కొడాలి, వల్లభనేని పటిష్టంగా..
తెలుగుదేశం పార్టీ టార్గెట్ గా పెట్టుకున్న వారిలో గుడివాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోను రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. వల్లభనేని వంశీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించి వైసీపీకి అనుబంధంగా వ్యవహరిస్తున్నారు. అలాగే కొడాలి నాని రెండుసార్లు టీడీపీ నుంచి, రెండుసార్లు వైసీపీ నుంచి గుడివాడకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

తెలుగు తమ్ముళ్లలో కసిని రేకెత్తిస్తోన్న ఇద్దరూ..
చంద్రబాబునాయుడిపై, లోకేష్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ వీరిద్దరూ వైసీపీలో బాగా ప్రాచుర్యం పొందారు. దీంతో తెలుగు తమ్ముళ్లలో వీరిద్దరినీ ఓడించాలని పట్టుదలగా ఉన్నారు. కానీ తాజాగా ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో వీరిద్దరికీ ఎదురులేదని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా గుడివాడ నుంచి కొడాలి నాని, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ విజయం సాధించడం ఖాయమని తేలింది. ఎప్పటినుంచో నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎన్ని విమర్శలు చేసినా అవేమీ వారిని నిరోధించలేవని, స్థానికంగా గట్టి పట్టుండటంతోనే వీరికి గెలుపు సాధ్యమవుతోందని స్పష్టమవుతోంది.

పార్టీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు?
నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర యువగళంలో తిరుపతిలో నిర్వహించిన హలో లోకేష్ కార్యక్రమంలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానిస్తారా? అని అడిగితే లోకేష్ సమాధానమిస్తూ ఆహ్వానిస్తున్నామని సమాధానం ఇచ్చారు. దీనిపై తాజాగా కొడాలి నానిమాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణను అవమానించారని, ఆయనకు పదవులివ్వకుండా దూరం చేశారన్నారు. 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు కూడా గ్యాలరీలో హరికృష్ణను కూర్చోబెట్టి అవమానించారని, వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని లోకేష్ జూనియర్ ను ఆహ్వానించడమేంటని నిలదీశారు. జూనియర్ ఎన్టీఆర్‌ని టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు? అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీలోకి ఎన్టీఆర్ ని ఆహ్వానించడం ఏంటి? అని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications