తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం.. రంగంలో దిగారు
Tirumala Laddu row: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం మలుపులు తిరుగుతోంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేపనూనెలను వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
టీటీడీ నెయ్యి టెండర్ నిబంధనల సడలింపు, అమలులో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న అవకతవకలపై విచారణ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఈ దర్యాప్తు చేపట్టింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఈ కమిషన్ కు సారథ్యాన్ని వహిస్తోన్నారు. మంగళవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తన పనిని ఆరంభించారు. టీటీడీలో పరిపాలనా జవాబుదారీతనంపై దర్యాప్తు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

దీనికోసం సోమవారం సాయంత్రమే దినేష్ కుమార్ తిరుపతికి చేరుకున్నారు. విచారణకు సంబంధించిన ప్రాథమిక సంప్రదింపులు నిర్వహించారు. విచారణ పూర్తయ్యే వరకు తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం అనుబంధ భవనాన్ని కమిషన్ ప్రధాన కార్యాలయంగా మార్చుకునే అవకాశం ఉంది. కమిషన్‌కు అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి సీనియర్ రిటైర్డ్ అధికారుల బృందాన్ని ప్రభుత్వం నియమించింది.
వీరిలో మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి మునీంద్ర, ప్రభుత్వ సహాయ కార్యదర్శి శివ కుమార్, ఆర్‌టీజీఎస్ డిప్యూటీ సీఈఓ మాధురి ఉన్నారు. టీటీడీ తన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ప్రాపర్టీస్ ఎన్ రవిని సమన్వయ అధికారిగా నియమించింది. విచారణకు అవసరమైన సమన్వయం, లాజిస్టికల్ సహకారాన్ని అందిస్తారు.
నెయ్యి కొనుగోలు టెండర్ల నిర్వహణలో పాలనాపరమైన లోపాలు, విధానపరమైన ఉల్లంఘనలు ఉన్నాయని సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అంతర్గత నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ విచారణకు ప్రాధాన్యత పెరిగింది. కమిషన్ ఇప్పటికే టెండర్ ప్రక్రియకు సంబంధించిన అధికారిక రికార్డులు, పత్రాలను పరిశీలించడం ప్రారంభించింది. సిట్ నివేదికలో పేర్కొన్న మార్కెటింగ్, కొనుగోళ్లు, గోడౌన్ల విభాగాల వారితో పాటు, మాజీ టీటీడీ చైర్మన్లు, సీనియర్ అధికారుల వాంగ్మూలాలను నమోదు చేసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications