వరద సాయం పేరుతో జీఎస్టీలో సెస్-ఏపీలో మరో బాదుడు తప్పదా ?
ఏపీలో ఈ ఏడాది వచ్చిన వరదలు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఉక్కికిబిక్కిరైనా వెంటనే తేరుకుని భారీ ఎత్తున సాయం చేసి బాధితుల్ని ఆదుకుంది. ఈ వరదల నష్టంపై కేంద్రానికి నివేదికలు పంపి సాయం కోరిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా జీఎస్టీ కౌన్సిల్ లో మరో ప్రతిపాదన చేసింది.
రాజస్థాన్ లోని జైసల్మేర్ లో తాజాగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఏపీ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రతిపాదన చేశారు. ఏపీకి వరద సాయం చేసేందుకు జీఎస్టీ రేట్లు పెంచాలని కేశవ్ జీఎస్టీ కౌన్సిల్ కు సూచించారు. జీఎస్టీలో 5 శాతానికి మించి స్లాబ్ ఉన్న వస్తువుల రవాణాపై ఒక శాతం అదనపు సెస్ విధించాలని పయ్యావుల ప్రతిపాదించారు. అయితే ఇది ఏపీకి మాత్రమే వర్తింపచేయాలని ఆర్థికమంత్రి కోరారు. గతంలో కేరళలోనూ ఇలాగే చేశారని ఓ ఉదాహరణ కూడా చెప్పారు.

జీఎస్టీలో 5 శాతం మించి స్లాబ్ ఉన్న వస్తువుల రవాణాపై ఒక శాతం సెస్ ను ఏపీలో విధించడం ద్వారా ఇక్కడ వరద ప్రాంతాలకు సాయం చేసేందుకు నిధులు ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్ ను ఆర్థికమంత్రి పయ్యావుల కోరారు. దీని వల్ల పేదలు, మధ్యతరగతిపై ఎలాంటి ప్రభావం పడదని కూడా తెలిపారు. 2018లో కేరళలో వచ్చిన వరదల సమయంలోనూ ఇలాగే నిర్ణయం తీసుకున్నారని జీఎస్టీ కౌన్సిల్ కు పయ్యావుల వెల్లడించారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పయ్యావుల ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తే 5 శాతం మించి జీఎస్టీ స్లాబ్ ఉన్న వస్తువుల రవాణా ఛార్జీలు మరింత పెరగడం ఖాయం.












Click it and Unblock the Notifications