వారంలో పెళ్లి పెట్టుకుని ఎందుకిలా చేశాడు?: ప్రేమే కారణమా! లేక..
ఈ నెల 14న వేణుకు వివాహం కూడా నిశ్చయమైనట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ప్రేమ వ్యవహారమేమైనా వేణు ఆత్మహత్యకు దారి తీసిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భీమిలి: మరో వారం రోజుల్లో పెళ్లి కావాల్సిన ఓ యువకుడు ఊరవతలి తుప్పల్లో విగతజీవిగా కనిపించాడు. మృతదేహం పక్కనే కూల్ డ్రింక్ బాటిల్, పురుగుమందు డబ్బా ఉండటాన్ని బట్టి చూస్తే.. ఇది ఆత్మహత్యేమో అన్న అనుమానం కలుగుతోంది. మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండటంతో చనిపోయి రెండు రోజులైనట్లుగా భావిస్తున్నారు.
విశాఖ జిల్లా భీమిలి మండలంలోని చెరుకుపల్లి అవంతి కాలేజీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం రాత్రి మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించగా.. మృతుడు దివీస్ ల్యాబరేటరీ ఉద్యోగి సీహెచ్ వేణు(27)గా గుర్తించారు.

కాగా, మృతుడి స్వస్థలం గుంటూరు జిల్లా ఐపూర్ మండలం కొచ్చెర్లగా గుర్తించారు. అతని జేబులో ఉన్న ఈఎస్ఐ గుర్తింపు కార్డు ఆధారంగా కొన్ని వివరాలు సేకరించారు. ఈ నెల 14న వేణుకు వివాహం కూడా నిశ్చయమైనట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఈ నేపథ్యంలో ప్రేమ వ్యవహారమేమైనా వేణు ఆత్మహత్యకు దారి తీసిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భీమిలి ప్రభుత్వాసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications