టమాటాల తర్వాత ఉల్లిపాయలే..
టమాటాల ధరలు దేశవ్యాప్తంగా మంట పుట్టిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రూ.150 చొప్పున, మరికొన్ని ప్రాంతాల్లో రూ.120 నుంచి రూ.130 చొప్పున అమ్మకాలు జరుగుతున్నాయి. ధరలు దిగివస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం ఇలా చెబుతుండగానే ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయి. మరో రెండు నెలల తర్వాత ఉల్లిపాయల ధర భారీగా పెరుగుతుందని నేషనల్ కమోడిటీస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా తెలిపారు.
ప్రస్తుతం నిల్వ చేసిన స్టాక్ నుంచి ఉల్లిపాయల్ని వాడుతున్నామని, ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవలేదని, దీని ప్రభావం అక్టోబరు, నవంబరు నెలల్లో మనకు కనపడుతుందన్నారు. వర్షాల వల్ల శీతాకాలపు పంట అయిన ఉల్లి బాగా దెబ్బతిందని, పొలాలు నీటితో నిండటంవల్ల కుళ్లిపోతుందన్నారు. ఉల్లిపాయల ధరలు పెరిగే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) కలిసి ఇప్పటివరకు 2.9 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను సేకరించినట్లు తెలుస్తోంది. సేకరణ ప్రక్రియ మరో రెండువారాల్లో పూర్తికానుంది. ఈ రెండు ఏజెన్సీలకు కలిపి కేంద్రం 3 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయల సేకరణ లక్ష్యాన్ని విధించింది. గత ఏడాది నాఫెడ్ ఒక్కటే 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లి బఫర్ స్టాక్ ను సృష్టించింది. మార్కెట్ లో ఉల్లిపాయల ధరలను నియంత్రించేందుకు బఫర్ స్టాక్ ను ఉపయోగిస్తారు. టమాటా, మర్చి, ఉల్లి, బంగాళదుంపను సామాన్యులు విరివిగా వాడుతుంటారు.












Click it and Unblock the Notifications