వైభవంగా సీతారాముల కల్యాణం..!!
నిండు పున్నమి వెన్నెల కాంతుల్లో ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు జిల్లా, రాష్ట్ర నలుమూలల నుంచి యాత్రికులు తరలివచ్చారు. వేదపండితులు ప్రత్యేక పూజలను నిర్వహించి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రభుత్వం తరుపున గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం శ్రీరాముల కల్యాణాన్ని నిర్వహించారు.
వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు.

సీతారాముల ఉత్సవ మూర్తులను నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రధాన ఆలయం నుంచి మంగళవాయిద్యాలతో భక్తుల శ్రీరామ నామ ధ్వనుల మధ్య కల్యాణం మండపం వద్దకు తీసుకువచ్చారు.రజిత సింహాసనంపై కల్యాణమూర్తులను ఆశీనులు చేశారు. వేదపండితులు విష్వక్సేన పూజ నిర్వహించారు. కర్మణ్యే.. పుణ్యాహవచనం అనే మంత్రంతో కల్యాణమండపం శుద్ధి జరిపి కల్యాణతంతుకు శ్రీకారం చుట్టారు.
సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడైన వరుడు కోదండరామస్వామి వారికి సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి అయిన వధువు సీతమ్మవారికి బుధవారం రాత్రి 9.23 గంటల సమయంలో హస్తా నక్షత్రయుక్త శుభలగ్నంలో మాంగల్యధారణ గావించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు ఒంటిమిట్ట కోదండరామాలయ అర్చకుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ముంజానికి ప్రథమం అనే మంత్రం జపిస్తూ వేదపండితులు కోదండరామయ్యకు ఎదురుగా సీతమ్మ వారిని కూర్చోబెట్టి కన్యావరణం నిర్వహించారు. రాయలసీమ జిల్లాల నుంచే కాక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, తెలంగాణ రాష్ట్రం నుంచి వేలాది మంది భక్తులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications