మరోసారి విపక్షాల భేటీ: రాహుల్ గాంధీ పక్కనే బ్లాక్ డ్రెస్‌తో చంద్రబాబు
అమరావతి/న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విపక్షాలు మరోసారి కలిశాయి. సేవ్ ది నేషన్ - సేవ్ డెమోక్రసీ పేరుతో ఎన్డీయేతర పక్షాలు ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో భేటీ అయ్యాయి. ఈ భేటీకి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. ఏపీ సీఎం నల్లటి దుస్తులతో వచ్చారు.
భేటీలో చంద్రబాబు, రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ, చంద్రబాబులతో పాటు కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్, డీఎంకే ఎంపీ కనిమొళి, బీఎస్పీ సతీష్ చంద్ర మిశ్రా, శరద్ యాదవ్, శరద్ పవార్, రాంగోపాల్ యాదవ్, తెలంగాణ జన సమితి అధినేత కోదండరాంతో పాటు పాటు పలు పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈవీఎంల పనితీరు, వ్యక్తమవుతున్న అనుమానాలపై చర్చించారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా చేపట్టాల్సిన ర్యాలీలపై చర్చించారు. త్వరలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఎన్డీయేతర పక్షాల భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
ఈవీఎంలపై అనుమానం
భేటీ అనంతరం ఏఐసీసీ అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు. ఈవీఎంల విషయంలో విపక్ష నేతలం అందరం కలిసి ఎన్నికల సంఘాన్ని కలుస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈవీఎంల విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు సోమవారం 21 బీజేపీయేతర పార్టీలు ఈసీని కలిసి, మెమోరాండం సమర్పిస్తాయని చెప్పారు. నాలుగున్నరేళ్లలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని చెప్పారు.
మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆగ్రహం
నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులను అవమానించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులకు రోజుకు రూ.17 ఇవ్వడం వారిని అవమానించడం అవుతుందని విమర్శలు గుప్పించారు. మీరు కేవలం పదిహేను మందికి రూ.3.5 లక్షల కోట్ల లోన్లు మాఫీ చేశారని, కానీ రైతుకు మాత్రం ఇంత తక్కువగా ఇస్తారా అని ఆరోపించారు. రానున్న ఎన్నికలు రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్య, సంస్థలపై దాడి, రాఫెల్ స్కాం తదితర అంశాల ఆధారంగా ఉంటాయని చెప్పారు. కాగా, రైతులకు ప్రభుత్వం అండగా నిలిచేందుకు చేస్తున్న సాయాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టడాన్ని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.












Click it and Unblock the Notifications