జీవో నంబర్ 1 పై హైకోర్టు తీర్పు-విపక్షాల రియాక్షన్ ఇదే...
ఏపీలో రోడ్ షోలు, బహిరంగసభల్ని నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై హైకోర్టు ఇవాళ కీలక తీర్పు ప్రకటించింది. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్న జీవో నంబర్ 1 చెల్లదంటూ హైకోర్టు తీర్పు నిచ్చింది.జీవో నంబర్ 1ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన సీపీఐ రామకృష్ణ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. అలాగే హైకోర్టు తీర్పును విపక్షాలు స్వాగతించాయి. అంతేకాదు జగన్ సర్కార్ పై విమర్శలు ఎక్కుపెట్టాయి.
హైకోర్టు జీవో నంబర్ 1 ని కొట్టేస్తూ ఇచ్చిన తీర్పుపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. ఏ1 తెచ్చిన జీవో1ని హైకోర్టు కొట్టేసిందని, ఫ్యాక్షన్ పాలనపై ప్రజాస్వామ్యం గెలిచిందని లోకేష్ తెలిపారు. రాజారెడ్డి రాజ్యాంగం ఇక చెల్లదంటూ అంబేద్కర్ రాజ్యాంగం నిరూపించిందన్నారు. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా హైకోర్టు తీర్పుపై రియాక్ట్ అయ్యారు. ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉన్న జీవో నెం.1ని కొట్టివేసిన ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు సభలు, రోడ్ షోలు, ర్యాలీలపై ఆంక్షలు తెచ్చారన్నారు.అంతిమంగా ఈ తీర్పు ప్రజా విజయమన్నారు.

జీవో నంబర్ 1పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా స్పందించారు. "న్యాయస్థానం న్యాయమే చేసిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యల పట్ల నినదించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని, ప్రభుత్వ ఆంక్షలు ఫలితంగా ప్రజా ఉద్యమాలు నిర్వీర్యం అవుతున్న తరుణంలో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. జీవో లు పేరు తో ప్రాధమిక హక్కులు కాలరాయాలని వైసీపీ ప్రభుత్వం కలగనడం ఇక నైనా మానాలన్నారు.
మరోవైపు జీవో నంబర్ 1 పై హైకోర్టులో పిటిషన్ వేసి విజయం సాధించిన సీపీఐ రామకృష్ణ కూడా దీనిపై స్పందించారు.ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 1ను కొట్టేస్తూ హైకోర్టు తీర్పునివ్వడం వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని రామకృష్ణ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించి ప్రతిపక్షాలను, ప్రజాసంఘాలను గౌరవించాలన్నారు. ప్రజా ఉద్యమాలపై పోలీసులను ప్రయోగించి, ఉక్కుపాదం మోపటం మానాలని సీపీఐ రామకృష్ణ కోరారు.












Click it and Unblock the Notifications