ఎపి రాజధాని: భూసేకరణకు రైతులపై ఆర్డినెన్స్ కొరడా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూసేకరణ చేసే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం చురుగ్గా ముందుకు కదులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. భూసేకరణకు సిఆర్‌డిఎ ఆర్డినెన్స్‌ను జారీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రాజధానికి భూములు ఇవ్వడానికి నిరాకరించే రైతులపై ఈ ఆర్డినెన్స్‌ను ప్రయోగించడానికి వెనకాడకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆర్డినెన్స్‌కు చంద్రబాబు నాయుడు పచ్చ జెండా ఊపినట్లు చెబుతున్నారు.
సిఆర్‌డిఎ ఆర్డినెన్స్‌ను మంత్రుల సంతకాల తర్వాత ఆమోదం కోసం గవర్నర్‌కు పంపే అవకాశం ఉంది. సిఆర్‌డిఎపై శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే, దానివల్ల తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉండడంతో ఆర్డినెన్స్ వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. బిల్లుపై శానససభలో చర్చ జరిగి, అది ఆమోదం పొందడానికి చాలా సమయం తీసుకుంటుందని, పైగా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న స్థితిలో అది మరింత కష్టంగా కాగలదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రాజధాని నిర్మాణానికి కొన్ని గ్రామాల రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వేసిన కమిటీ తేల్చి చెప్పింది. కమిటీ రాజధాని నిర్మాణం జరిగే ప్రాంతాల్లో పర్యటించి, ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. రైతులు రాజధానికి భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వం చెబుతున్న మాటల్లో నిజం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. వామపక్షాలు కూడా ప్రభుత్వ భూసేకరణ విధానాన్ని నిరసిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి శాసనసభలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందనే ఉద్దేశంతో బిల్లును ప్రతిపాదించడానికి బదులు ఆర్డినెన్స్ జారీ చేయడమే మేలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
కాగా, రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రణాళిక రచిస్తుండగా, జపాన్ నిర్మాణాన్ని చేపడుతుందని చంద్రబాబు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఈ నెల 9, 10 తేదీల్లో రాజధానిపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం విజయవాడలో సమావేశమై భూసేకరణపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, మంత్రి నారాయణ కమిటీ రెండు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఇదే సమయంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. మొత్తంమీద, రాజధానికి భూసేకరణ జరిపే విషయంలో ఆఘమేఘాల ముందుకు కదలేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధపడినట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications