సమాధానం: పవన్‌పార్టీపై పనబాక సెటైర్, కలెక్షన్లని గాలి
హైదరాబాద్: ప్రశ్నించే పార్టీకి సమాధానం చెప్పే పార్టీ తమదని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి గురువారం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త పార్టీని ఉద్దేశించి అన్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా తాము భయపడే ప్రసక్తి లేదన్నారు. కాంగ్రెసు పార్టీ ఓటు బ్యాంకు పదిలంగానే ఉంటుందని ఆమె అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ, సీమాంధ్రలను కలుపుతానని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. విభజన బిల్లును ఆపాలంటే కొత్త రాజ్యాంగం రావాలని ఆమె అన్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీకి ఢోకా లేదని, రానున్న ఎన్నికల్లో తామే గెలుస్తామన్నారు.

అన్న కలెక్షన్లు తగ్గాయనే: గాలి
తన అన్న కలెక్షన్లు తగ్గాయనే తమ్ముడు కొత్త పార్టీ పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు వేరుగా అన్నారు. పవన్ కొత్త పార్టీ నేపథ్యంలో ఆయన పై విధంగా వ్యాఖ్యలు చేశారు. అన్న కలెక్షన్లు తగ్గాయని తమ్ముడు పార్టీ పెడుతున్నారని... ఆయన చిరు, పవన్‌లను ఉద్దేశించి అన్నారు.
రాష్ట్ర విభజన పాపం కిరణ్, కెసిఆర్, జగన్‌లదని మండిపడ్డారు. విభజనకు రోడ్డు మ్యాప్ ఇచ్చింది కిరణ్ కుమార్ రెడ్డియే అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆయన డ్రామాలు ఆడారని ధ్వజమెత్తారు. తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడేది కేవలం టిడిపి మాత్రమే అన్నారు.












Click it and Unblock the Notifications