అక్రమ సంబంధం పెట్టుకుందని కూతురిని చంపిన తల్లిదండ్రులు
శ్రీకాకుళం/ విజయవాడ: అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఓ వివాహితను ఆమె తల్లిదండ్రులే దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సోమనాధపురంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన బగాది జయలక్ష్మి(32)కి పదమూడేళ్ల కిందట జగ్గారావుతో వివాహం జరిగింది.
వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. జగ్గారావు బీఎస్ఎఫ్ జవానుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మృతురాలు జయలక్ష్మి పిల్లలతో సహా తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో ఆమె వివాహేతర సంబంధాలు పెట్టుకోవడంతో సహనం కోల్పోయిన తల్లిదండ్రులు కూతురిని కర్రతో తలపై మోది హత్య చేశామని చెబుతున్నారు.
ఎంతగా చెప్పినా తమ మాట వినకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. హత్య జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు ఆమెను సోదరుడు మురళి హత్య చేశాడని, ఇందులో తల్లిదండ్రులు పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొండపై నుంచి జారిపడి మృతి
ఇదిలావుంటే, పోలీసులు దాడిచేయడానికి వస్తున్నారన్న భయంతో కొండపైన పరుగులు తీసిన పేకాటరాయుళ్లలో ఒకరు ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయాడు. కాగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన విజయవాడలో శుక్రవారం గొల్లపాలెంగట్టు సెంటర్ దగ్గర జరిగింది. ఈ గట్టు క్వారీసెంటర్ కొండపై పేకాట స్థావరం ఉంది.
ప్రతిరోజూ కొంతమంది అక్కడ పేకాట ఆడుతుంటారు. కొండదిగువన నివాసం ఉంటున్న ఓ మహిళ కొత్తపేట పోలీసులకు కుటుంబ కలహాలకు సంబంధించి ఫిర్యాదు చేసింది. పోలీసులు కొండ ఎక్కడం కొండ పైనుంచి చూసిన ఓ వ్యక్తి తమను పట్టుకునేందుకే పోలీసులు వస్తున్నారని బావించి పేకాట ఆడుతున్న మిగతా వారికి చెప్పడంతో వారంతా పరుగులు తీశారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సింహ మధు(35) కొండ పైనుంచి జారిపడి చనిపోయాడు.












Click it and Unblock the Notifications