పరిటాల హత్య తిరగదోడ్తం: సునీత, బాబుపై పురంధేశ్వరి
హైదరాబాద్/ముంబై: పరిటాల రవి హత్య కేసును తాము తిరగదోడుతామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునిత ఆదివారం చెప్పారు. రవి హత్య కేసులో అసలు నిందితులకు శిక్షపడే వరకు తాము పోరాడుతామన్నారు. తనకు మంత్రి పదవి వస్తే పరిటాల రవికి ఇచ్చినట్లేనని చెప్పారు. ఆమె గుంటూరులో విలేకరులతో మాట్లాడారు.
బిజెపి కట్టుబడి ఉంది: పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి బిజెపి కట్టుబడి ఉందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి వేరుగా అన్నారు. పోలవరం నిర్మాణానికి అనుకూల పరిస్థితి బిజెపి వల్లే వచ్చిందని చెప్పారు. బిజెపి కృషి వల్లే ఎపికి ప్రత్యేక హోదా లభించనుందన్నారు. సిఎంగా నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబుకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

బాబుకు శుభాకాంక్షలు : వివేక్ ఒబెరాయ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబుకు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారోత్సవానికి చంద్రబాబు తనను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపథంలో నడుస్తుందని ఆశిస్తున్నాని వివేక్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీతకు వివేక్ శుభాకాంక్షలు తెలియజేశారు.
విజయవాడ బయల్దేరిన విమానం
20 మంది కేంద్రమంత్రులు, వివిధ జాతీయ పార్టీల నేతలతో ప్రత్యేక విమానం బయల్దేరింది. ఢిల్లీ నుంచి బయల్దేరిన ఈ విమానం సాయంత్రం విజయవాడ చేరుకోనుంది. వారంతా విజయవాడ నుంచి నేరుగా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications