మా ఇమేజ్ పెరిగితే పార్టీకే: బొత్స, గవర్నర్‌తో జగన్ భేటీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేదా తన ఇమేజ్ పెరిగితే తమ పార్టీకి కూడా ప్రతిష్ట పెరిగినట్లేనని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం అన్నారు. విభజన విషయంలో అప్పటి పరిస్థితుల నేపథ్యంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పామని, పరిస్థితులు మారక కూడా అదే ప్రామాణికం అంటే ఎలా అని బొత్స ప్రశ్నించారు.
ఏ ఒక్కరో ఇద్దరి రాజీనామాల వల్లనో ప్రయోజనం ఉండదని అవసరమైతే అందరం కలిసి నిర్ణయం తీసుకుందామని తాను తమ పార్టీ సీమాంధ్ర నాయకులకు చెబుతున్నానన్నారు. తెలంగాణపై కేబినెట్ నోట్ రాకముందే ఆంధ్ర ప్రదేశ్‌లో ఆంటోని కమిటీ పర్యటించాలని తాను కోరినట్లు చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు కలిగిన వారే పార్టీలోకి వెళ్తున్నారని చెప్పారు. 2014 వరకు ఎలాంటి మార్పులు ఉండవని చెప్పారు. ముఖ్యమంత్రి మార్పు చెప్పేందుకు తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏమైనా తమ అధిష్టానమా అని ప్రశ్నించారు.
నేర చరిత్రుల ఆర్డినెన్స్ పైన ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బొత్స స్వాగతించారు. కాగా, బొత్స సత్యనారాయణ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మరోవైపు సీమాంధ్రుల సమస్యలు తెలంగాణ నోట్‌లో పెట్టకపోయినా ముసాయిదాలో మాత్రం పెడతారని కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు.
గవర్నర్‌ను కలిసిన జగన్
వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. వెంటనే అసెంబ్లీని సమావేశపర్చి సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానం చేయించాలని కోరారు.












Click it and Unblock the Notifications