లోక్‌సభకు పోటీ చేయడంపై తేల్చేసిన పవన్: పిఠాపురం కాబోయే ఎమ్మెల్యేను నేనే
Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. లోక్‌సభకు పోటీ చేస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా జోరుగా సాగుతూ వచ్చింది. పిఠాపురం అసెంబ్లీ, కాకినాడ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఆయన బరిలోకి దిగుతారని, కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ఆయన కేంద్ర మంత్రి అవుతారనే ప్రచారం సైతం విస్తృతంగా సాగింది.
వాటన్నింటికీ తెర దించారు పవన్ కల్యాణ్. పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా నాయకులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు ఉదయ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా ఉదయ్ పోటీ చేస్తారని ప్రకటించారు. తాను అసెంబ్లీ బరిలో ఉంటాననీ తేల్చి చెప్పారు.

దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలంటూ తనకు ఆహ్వానాలు సైతం అందాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని, ఆ తరువాతే దేశం గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు. ఉదయ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పార్టీ క్యాడర్‌కు విజ్ఞప్తి చేశారు.
కాకినాడ పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేట్ భారీగా పెరిగిపోయిందని, దీన్ని నిలువరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే- స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో తాను తెలుగుదేశం పార్టీతో పొత్తు కున్నామని, బీజేపీ కూడా కలిసి వచ్చిందని వివరించారు.
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు అనేది పిఠాపురం నుంచే మొదలవ్వాలని పవన్ కల్యాణ్ అన్నారు. అక్కడి నుంచి తరలివచ్చిన పార్టీ క్యాడర్‌ను చూస్తూ ఉంటే పిఠాపురానికి కాబోయే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమనే నమ్మకం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల అనంతరం కేంద్రం, రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వాల్లో తమ భాగస్వామ్యం ఉంటుందని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికలు ఎప్పుడో ముగిశాయని, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అనుకూలంగా ప్రజలు ఓటు వేయడం మాత్రమే మిగిలివుందని పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురంలో లక్ష మెజారిటీతో గెలుస్తానని పేర్కొన్నారు. కాకినాడ పార్లమెంట్ దద్దరిల్లిపోయేలా మెజారిటీ ఉండాలని చెప్పారు.












Click it and Unblock the Notifications