స్థానిక పోరు పై పవన్ కొత్త వ్యూహం - ఎలక్షన్ టీం ఖరారు, కీలక ఆదేశాలు..!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు సర్వం సిద్దం అవుతోంది. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేసేలా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అయిదు కేటగిరీల్లో రిజర్వేషన్లు అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో జనసేనాని పవన్ కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. పార్టీ పరంగా ఈ ఎన్నికలను పవన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసారు. వారికి కీలక బాధ్యతలు అప్పగించారు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం పవన్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. వరుసగా పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయి సమాచారాన్ని సమగ్రంగా సేకరించేందుకు, స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో ముగ్గురు పార్లమెంట్ స్థాయి నాయకులకు స్థానం కల్పించారు. జనసేన ఎమ్మెల్యే లేదా ఎంపీలు ఉన్న చోట వారి ఆధ్వర్యంలో కమిటీలు పని చేస్తాయి. మిగతా ప్రాంతాల్లో సీనియర్ నాయకులు, కార్పొరేషన్ ఛైర్మన్లు బాధ్యతలు తీసుకుంటారు. వీరికి సహకరించేందుకు పార్లమెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం ఉండేలా 32 మందితో నిర్వాహక్ దళ్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక ఎన్నికల్లో జనసేన బలమైన పాత్ర పోషించేలా, పార్టీ శ్రేణులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడమే లక్ష్యంగా కమిటీలు పని చేయనున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాలను మాత్రం కేంద్ర కమిటీ ద్వారా పవన్ స్వయంగా పర్యవేక్షిస్తారు. వీటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కమిటీ, మార్గదర్శక కమిటీ, కూటమి సమన్వయ కమిటీ, ప్రచార కమిటీ, ట్రెజరీ కమిటీలను పవన్ కల్యాణ్ నియమించారు.

పవన్ ప్రత్యేక ఫోకస్.. వరుస నిర్ణయాలు
కాగా, స్థానిక ఎన్నికల పైన పార్టీ నేతలకు పవన్ కీలక దిశా నిర్దేశం చేస్తున్నారు. తాను స్వయంగా సమీక్షలు చేసిన తరువాత ఈ కమిటీలను ప్రకటిస్తున్నారు. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత పరిస్థితి, నాయకుల పనితీరు, స్థానిక రాజకీయాలు, ప్రజా సమస్యలు, ఆశావహ అభ్యర్థుల వివరాలు, కూటమి సమన్వయం తదితర అంశాలపై పనిచేస్తాయి. ఐదుగురు సభ్యులతో కూడిన స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీకి వీరు సమాచారం ఇస్తారు. ఈ కమిటీ పవన్ కు నేరుగా నివేదికలు అందించనుంది. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలతో కలిసి సమన్వయం.. అభ్యర్ధుల ఖరారు.. పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యల పైన కమిటీలు పార్టీ అధినేతకు ఇచ్చే నివేదికలు కీలకం కానున్నాయి. మొత్తంగా స్థానిక ఎన్నికల్లో పవన్ అమలు చేస్తున్న వ్యూహాలు.. తీసుకుంటున్న నిర్ణయాలతో రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications
