బాలయ్య - పవన్ కలిసికట్టుగా, టార్గెట్ జగన్ : పొలిటికల్ మాస్టర్ ప్లాన్..!!
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం. చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్ర రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో ఈ రోజు పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, లోకేశ్ కలవనున్నారు. ఈ భేటీ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కీలకంగా మారుతోంది. టీడీపీ, జనసేన పొత్తు అధికారికం కానుంది. సినిమాలకు బ్రేక్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక జగన్ లక్ష్యంగా బాలయ్య - పవన్ కలిసికట్టుగా ప్రజల్లోకి వచ్చేందుకు రంగం సిద్దం అవుతోంది.
చంద్రబాబుతో ముగ్గురి భేటీ:స్కిల్ స్కాంలో తెలుగుదేశం అధినేత రిమాండ్ లో ఉన్నారు. ఈ నెల 19 తరువాతనే చంద్రబాబు జైలు నుంచి బయటకు రావటం పైన క్లారిటీ రానుంది. ఇదే సమయంలో జైలు నుంచే చంద్రబాబు రాజకీయ వ్యూహాలను నిర్దేశిస్తున్నారు. ఈ రోజుల పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, లోకేశ్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు.

ఈ సమయంలో భవిష్యత్ రాజకీయ కార్యాచరణ పైన చంద్రబాబు వారి ముగ్గురికీ దిశా నిర్దేశం చేయనున్నారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అటు కేంద్రంలో జరుగుతున్న పరిణామాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ ఈ నెల 16న హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షా తో భేటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
బాలయ్య - పవన్ కలిసి సభల్లో:చంద్రబాబు అరెస్ట్ పై బీజేపీ మౌనంగా ఉండటం పై టీడీపీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నా..చంద్రబాబుతోనే కలిసి వెళ్లాలని పవన్ నిర్ణయించారు. బీజేపీ తోనూ ఇదే అంశంపైన చర్చించి..వారి అభిప్రాయంపైన స్పష్టత వచ్చిన తరువాత భవిష్యత్ లో బీజేపీతో బంధం పైన నిర్ణయం తీసుకొనేందుకు సిద్దం అవుతున్నారని సమాచారం. రాజమండ్రి చేరుకున్న తరువాత పవన్ ముందుగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని పరామర్శిస్తారు.
తరువాత బాలకృష్ణ, లోకేశ్ తో కలిసి చంద్రబాబును కలిసిన వేళ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆ తరువాత రాజమండ్రిలో ఈ ముగ్గురు నేతలో భేటీ కానున్నారు. వినాయక చవిత తరువాత నుంచి ప్రజల్లోకి రెండు పార్టీలు కలిసి వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది కార్యాచరణ డిసైడ్ చేయనున్నారు.

రాజకీయ కార్యాచరణ ఖరారు:ఇక నుంచి నందమూరి బాలకృష్ణ - పవన్ కల్యాణ్ కలిసి ప్రజల్లోకి వెళ్లి రోడ్ షోలకు ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రజల మధ్యకు వెళ్లనున్నారు. అదే విధంగా రెండు పార్టీలు కలిసి క్షేత్ర స్థాయిలో రాజకీయ పోరాటం ముమ్మరం చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఈ రోజున చంద్రబాబుతో భేటీ సమయంలో స్పష్టత రానుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఎన్నికల పైన స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో, చంద్రబాబు అరెస్ట్ తో చర్చ జరుగుతున్న సమయంలోనే బాలయ్య - పవన్ కలిసి కట్టుగా ప్రజల్లోకి వెళ్తే రెండు పార్టీల కేడర్ లోనూ జోష్ వస్తుందని భావిస్తున్నారు. దీంతో, ఈ రోజు చంద్రబాబుతో ఈ ముగ్గురు భేటీ.. తరువాతి సమావేశం..తీసుకొనే నిర్ణయాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications