కాకినాడకు ఊరటనిచ్చే వార్త చెప్పిన పవన్ ..! తుఫాన్ భయాల వేళ..!
ఏపీలో మొంథా తుపాన్ ప్రభావం ప్రారంభమైంది. ఇప్పటికే పలు జిల్లాల్లో తుపాను జల్లులు కురుస్తున్నాయి. ఎల్లుండి కాకినాడ వద్ద తుపాను తీరం దాటబోతోందని అంచనా వేస్తున్నారు. రేపు ఉదయం నుంచి తుపాను ప్రభావం మరింత తీవ్రం కాబోతోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం ఉన్న కాకినాడ జిల్లాలో పరిస్ధితిపై ఇవాళ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ మంత్రి నారాయణను అక్కడికి పంపి మరీ అధికారులతో అక్కడి పరిస్ధితిని సమీక్షించారు.
అనంతరం పవన్ కళ్యాణ్ అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు కాకినాడ జిల్లా వాసులకు ఊరట కలిగించే ఓ వార్త కూడా చెప్పారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నందున జిల్లా వాసులకు తుపాన్ పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రజలకు తెలియచేయాలని అధికారుల్ని పవన్ ఆదేశించారు. దీంతో అధికారులు పవన్ మాటగా ఈ విషయాన్ని జనానికి చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న క్రమంలో కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై ఇవాళ మధ్యాహ్నం మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 12 మండలాలపై తుపాను ప్రభావం ఉంటుందనీ తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వారికి అవసరమైన ఆహారం, రక్షిత తాగు నీరు, పాలు, ఔషధాలు సమకూర్చుకోవాలన్నారు.

తుపాను తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండి విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. అలాగే గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగుల వివరాలు తెలుసుకొని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని దిశానిర్దేశం చేశారు. మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అత్యవసర సాయం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.19 కోట్ల విడుదల చేయగా.. అందులో కాకినాడ జిల్లాకు కోటి కేటాయించారు. ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో సౌకర్యాల కల్పన, ప్రజలకు నిత్యవసర సరుకుల పంపిణీ, ఇళ్లు కూలడం, దెబ్బ తినడం వంటి సంఘటనలు జరిగితే తక్షణ సాయం చేయడం వంటి చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.












Click it and Unblock the Notifications