పదవి కోసం టి గుర్తు రాలేదు, చలించా: కెసిఆర్‌పై పవన్
మహబూబ్ నగర్/హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్‌లో బిజెపి-టిడిపి కూటమి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చురకలు వేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదని తెలంగాణ గుర్తుకు రాలేదని కెసిఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవాచేశారు. తనకు తెలంగాణ అంటే ఇష్టమని, తాను తెలంగాణ సాయుధ పోరాటం చదువుతూ పెరిగానన్నారు.
యువకుల బలిదానాలతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం అందరం ప్రతినబూనుదామని చెప్పారు. ఓట్లు చీల్చకూడదనే తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర నిధులు సాధించగలిగే నేత కావాలని చెప్పారు. ఎన్డీయేలో టిడిపి, జనసేనలు భాగస్వాములు అని చెప్పారు. కాంగ్రెసు వ్యతిరేక ఓటు చీల్చడం తనకు ఇష్టం లేదన్నారు.

తెలంగాణ ప్రకటన తర్వాత కుటుంబంతో కలిసి కెసిఆర్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారన్నారు. ఆ తర్వాత బలిదేవత అన్నారని ఎద్దేవా చేశారు. యువకుల బలిదానాలు తనను కదిలించాయని చెప్పారు. యువతకు అన్యాయం జరిగితే ప్రశ్నించేందుకే తాను పార్టీని పెట్టానని చెప్పారు.
ప్రజల తరఫున ప్రశ్నించే పార్టీ జనసేన అన్నారు. తాను సినిమాలు చేస్తూనే ప్రజలకు జరిగే అన్యాయంపై ప్రశ్నిస్తానని చెప్పారు. మంత్రి పదవి ఇవ్వలేదని తాను తెలంగాణను ఎత్తుకోలేదన్నారు. తెరాస మేనిఫెస్టో చూస్తే అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నట్లు ఉందన్నారు. బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణను ఇక బంగారు తెలంగాణ చేద్దామన్నారు.
అనుమతి దొరక్క..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హెలికాప్టర్‌కు ఎటిసి అనుమతి దొరకలేదు. దీంతో ఆయన రోడ్డు మార్గం ద్వారా షాద్ నగర్ చేరుకుని ప్రచారం ప్రారంభించారు.












Click it and Unblock the Notifications