సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్ చైతన్య రథం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని, ఆరుశాతం ఓట్లను సాధించిన జనసేన ఈసారి కింగ్ మేకర్ ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయదశమి నుంచి బస్సుయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రను పవన్ ఎన్నికలయ్యేంతవరకు కొనసాగించాలని, మధ్య మధ్యలో విరామం తీసుకున్నప్పుడు పెండింగ్‌లో ఉన్న సినిమాల షూటింగ్‌ను పూర్తిచేయాలని భావిస్తున్నారు.

పర్యవేక్షిస్తున్న టీటైమ్ ఉదయ్
పవన్ యాత్రను దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీ నేతలు ఒక ప్రత్యేకమైన వాహనాన్ని తయారుచేయిస్తున్నారు. అది ముంబయిలో సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా టీటైమ్ ఔట్‌లెట్స్ తో పేరు తెచ్చుకున్న యువ పారిశ్రామికవేత్త ఉదయ్‌కు దాని బాధ్యతను అప్పగించారు. ఆయన దగ్గరుండి ఈ వాహనం ఎలా ఉండాలనే దానిపై సూచనలు అందిస్తున్నారు. ఉదయ్ ఇటీవలే పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.

బాడీకి మిలిటరీకి చెందిన ఆకుపచ్చ రంగు
యాత్రను ఎన్నికలు జరిగేవరకు పొడిగించడంతోపాటు తర్వాత కూడా ప్రచారానికి ఉపయోగించాలన్న ఉద్దేశంతో జనసేనాని ఉన్నారు. అందుకు తగ్గట్లుగా అవసరమైన హంగులను ఈ వాహనానికి ఉపయోగిస్తున్నారు. బాడీ దృఢంగా ఉండటంతోపాటు మిలిటరీకి చెందిన ఆకుపచ్చ రంగు వాడుతున్నారు. వాహనానికి రెండువైపులా బార్‌లు, ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. ఒకవైపు ఆరుగురు, మరోవైపు ఇంకో ఆరుగురు బాడీ గార్డులు నిలబడేలా దీన్ని రూపొందిస్తున్నారు. అలాగే వాహనం లోపలి నుంచి పవన్ కల్యాణ్ నేరుగా టాప్ మీదకు చేరుకులా ఏర్పాట్లు చేయిస్తున్నారు.

ఎన్టీఆర్ చైతన్య రథంలా..
1983లో ఎన్టీఆర్ కోసం రూపొందించిన చైతన్య రథం ఎలా ఉంటుందో దాన్ని మోడల్‌గా తీసుకొని చేయిస్తున్నారు. పార్టీని నడిపించడం కోసం డబ్బులు అవసరం కావడం.. రాజకీయ విరాళాలు కూడా తక్కువగా వస్తుండటంతో ఆ పార్టీ నేత నాగబాబు ఇటీవలే ఒక క్యాంపెయిన్ ప్రారంభించారు.అయినా సినిమాల రెమ్యునరేషన్ ను కూడా వాడుతుండటంతో ఒప్పుకున్న సినిమాలను త్వరత్వరగా పూర్తిచేయాలని పవన్ యోచిస్తున్నారు. ఇటీవలే రెండు సినిమాలకు డేట్లు ఇచ్చారు. అవి కూడా కొద్దిరోజులే ఇవ్వడంతో అంత తక్కువ సమయంలోనే పవన్ కు సంబంధించిన సన్నివేశాలు పూర్తయ్యేలా దర్శకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications