Ysrcp Vs Janasena: పులివెందులలో సమరసింహారెడ్డిలా పవన్ కల్యాణ్? తొడ కొడతారా? లేదా?
సమరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ విలన్ ఇంటికెళ్లి నీ ఇంటికొచ్చా.. నీ నట్టింటికొచ్చా.. అంటూ తొడ కొట్టి సవాల్ విసురుతారు. ఇప్పుడు ఇదే తరహాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి సవాల్ విసిరారు. కొద్దిరోజులుగా జనసేనపై, పవన్‌కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్న వైసీపీ నేతలకు పవన్ గట్టి సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో బహిరంగసభ నిర్వహించబోతున్నారు.

కడప జిల్లాలో కౌలు రైతుల యాత్ర.. పులివెందులలో బహిరంగసభ
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకునేందుకు జనసేనాని కొద్దిరోజులుగా యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం కింద ఇస్తున్నారు. తద్వారా వారిని ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరుతున్నారు. జులైలో కడప జిల్లాలో కౌలు రైతుల యాత్ర నిర్వహించి పులివెందులలో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేయబోతున్నారు. ఈ విషయమై ఇప్పటికే పార్టీ ముఖ్యులతో చర్చించారు. అదే సభలో రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తులో జనసేన పోషించబోయే పాత్రపై దోబూచులాడకుండా ఒక స్పష్టత ఇవ్వాలని నిర్ణయించారు.

భవిష్యత్తుపై స్పష్టతనివ్వనున్న జనసేనాని
పులివెందుల సభకు భారీగా జనసమీకరణ చేయడంద్వారా సొంత నియోజకవర్గంలో, సొంత జిల్లాలో కూడా ముఖ్యమంత్రి జగన్‌కు, వైసీపీకి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అనే సంకేతాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు పంపించాలని జనసేనాని నిర్ణయించారు. అందుకు తగ్గట్లుగా ఇప్పటినుంచే ఒక ప్రణాళిక రచించుకుంటున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నేతలంతా ఈ విషయమై అంతర్గతంగా చర్చించారు. సభ నిర్వహణకు అధికార పార్టీ నుంచి ఎన్ని అడ్డంకులు వచ్చినా తగ్గకూడదని భావిస్తున్నారు.

కేసులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యవస్థ
రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని పవన్ ఆరోపించారు. ఈ కేసులకు సంబంధించి కోర్టులో పరిష్కారం కోసం, వాటిని ఎదుర్కొనేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోను ఈసారి వైసీపీని అధికారంలోకి రానివ్వనని, పార్టీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని, 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు తాను తగ్గానని, త్యాగం చేశానని, ఈసారి మిగతవారు కూడా తగ్గాలని నేరుగా తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలకు సంకేతాలు పంపించారు.

పవన్ వ్యాఖ్యలను ఖండించని వైసీపీ నేతలు
కొన్ని వర్గాలు సహజంగానే వైసీపీకి దూరమయ్యాయని, ఓటుబ్యాంకుగా చెప్పుకుంటున్న వర్గాలు కూడా దూరమయ్యాయనేది పవన్‌కల్యాణ్ విశ్లేషణగా ఉంది. కోనసీమ అల్లర్ల వెనక కచ్చితంగా వైసీపీ హస్తం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇంతవరకు ఆయన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలెవరూ ఖండించకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications