జగన్‌తో పొత్తుకు పవన్ కల్యాణ్ నో: అందుకే జగన్ కౌంటర్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంపై గురువారం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
రాజమండ్రి పర్యటనలో ఆ విషయంపై మాట్లాడారు. రాజమండ్రి పర్యటనలో ఆయన జగన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అవినీతిపై కూడా మాట్లాడారు.

జగన్‌తో పొత్తుపై ప్రచారం...
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పొత్తు పెట్టుకుందని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఇరు పార్టీల మధ్య చర్చలు జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, అవన్నీ రహస్యంగానే ఉంటూ వచ్చాయి.

ఇరు పార్టీల మధ్య పొత్తుకు ప్రాతిపదిక ఇదీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని వైసీపీ, జనసేన వేరువేరుగా డిమాండ్ చేస్తూ వచ్చాయి. ప్రత్యేక హోదాపై యువతను కదిలించడానికి వైయస్ జగన్ రాష్ట్రంలో సమావేశాలు కూడా నిర్వహించారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, ఈ విషయంలో బిజెపిని తప్పు పడుతూ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వచ్చారు. ప్రత్యేక హోదా ప్రాతిపదికపైనే ఇరు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందనే ప్రచారం ముమ్మరంగా సాగింది.

కేసులు లేకుంటే అంటూ...
జగన్‌కు మద్దతు విషయంలో పవన్ స్పష్టత ఇచ్చారు. జగన్‌పై కేసులు లేకుంటే ఆయనకు మద్దతు ఇచ్చేవాడినని తేల్చిచెప్పారు. జగన్‌పై కేసులపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. కోర్టు విచారణకు హాజరవుతూనే ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కేసుల విషయం తేలుతుందా లేదా అనేది చెప్పలేం.

ప్రశాంత్ కిశోర్ సూచన మేరకు జగన్...
తన పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచన మేరకే జగన్ పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. ప్రతిపక్షాల ఓట్లు చీలిపోకుండా చంద్రబాబు వ్యతిరేక కూటమి కట్టాలనేది ఆయన సూచనగా చెబుతారు. అయితే, రాష్ట్రంలోని వామపక్షాలు జగన్‌తో కలిసి నడుస్తాయా, పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేస్తాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

అందుకే జగన్ ఎదురుదాడి
తమతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరని తెలిసిన తర్వాతనే వైయస్ జగన్ పవన్ కల్యాణ్‌పై ఎదురుదాడికి దిగినట్లు భావిస్తున్నారు. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ పనిచేస్తూన్నారనే వ్యాఖ్యను అందుకే చేసినట్లు కూడా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications