2019లో కింగ్‌ అవుతారా? కింగ్‌ మేకర్‌ అవుతారా?: పవన్ ఇంటర్యూ

హైదరాబాద్: పవన్ కళ్యాణ్.... తెలుగు సినీ రంగంలో 'అభిమానం' అనే పదాన్ని 'భక్తి' స్థాయికి తీసుకెళ్లిన హీరో. అంతేనా హీరోయిజానికి కొత్త ఉత్సాహాన్ని నింపిన వ్యక్తి. ఆయనకు సమాజం అంటే ప్రేమ. పుస్తకాలంటే పిచ్చి. చదివింది ఆచరిస్తాడు. ఆచరించేదే చెప్తాడు. పవన్‌లో ఆ నిజాయతే అభిమానులకు నచ్చుతుంది.

అందుకే పవర్ స్టార్ అభిమానులకు దైవంతో సమానం. పవన్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలైన నేపథ్యంలో ఆదివారం ఆయన ఒక టీవీ చానెల్‌కి ఇంటర్యూలో మాట్లాడుతూ జనసేన పార్టీ గురించి తన రాజకీయ ప్రణాళికను ప్రకటించారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

Pawan Kalyan

ఈలోపు ఎన్ని సినిమాలు అయితే అన్ని తీస్తానన్నారు. ప్రజల్లో ఉండాలన్నదే తన అభిమతమని తెలిపారు. ''ఏ పని చేసినా నిజాయితీగా చేస్తా. రాజకీయాల్లో నిలబడగలనన్న నమ్మకం నాకుంది. ఓటమి గెలుపుల గురించి ఆలోచించకూడదని పీఆర్పీ ఓటమితో తెలుసుకున్నాను'' అని తెలిపారు.

ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్‌గా వస్తారా?
అవును. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుంది.

మరి... మీ సినిమాల పరిస్థితి ఏమిటి?
నాకు సినిమాల మీద మోజు లేదు. నాలో లోపలున్నది వేరే. యాక్సిడెంటల్‌గానే సినిమాల్లోకి వచ్చాను. ఒక్క సినిమా సమయంలో 3 నెలలు మరేవీ ఆలోచించను.

ఇంకా ఎన్ని సినిమాలు తీస్తారు?
నాకిష్టమైనది సినిమానే. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా వచ్చేలోపు ఎన్ని వీలైతే అన్ని సినిమాలు చేస్తాను. 2 కావొచ్చు. 3 కావొచ్చు. దాసరితో సినిమా చేయాలని ఉంది. చేస్తాను. కథ ఆయనదే. నిర్మాతగా కూడా ఆయనే ఉంటారు.

మావాడికి నేనంటే కోపం
''అకీరాకు నేనంటే చాలా ఇష్టం. వాడు సినిమా వాతావరణానికి దూరంగా ఉంటున్నాడన్న సంతోషంగా ఉన్నా నా దగ్గర లేడనే బాధగా ఉంది. వాడికీ ఆ బాధ ఉంది. అందుకే వాడికి నాపై కోపం. నా స్టార్‌ స్టేటస్‌, ఇమేజ్‌కు అకీరా దూరంగా ఉండటం మంచిదే. భవిష్యత్తులో తను ఏం చేస్తాడన్నది తన ఇష్టాయిష్టాల్నిబట్టే ఉంటుంది''

భారీ పారితోషికం తీసుకొనే కథానాయకుడు మీరు. ఆర్థికంగా నిలబడకపోవడమేమిటి?
డబ్బులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా. నెల గడవడమే కష్టంగా ఉందని, తన సిబ్బందికి జీతాలు చెల్లించాలన్నా ఇబ్బందిగా ఉన్నా. డబ్బుల గురించి ఆలోచించలేదు. ఈ సినిమాకొచ్చిన డబ్బులతో ఓ ఇల్లు కొనాలి, ఓ స్థలం కొనుక్కోవాలి, దాచుకోవాలి.. అంటూ జాగ్రత్త పడలేదు. అలా జాగ్రత్త పడాలని చెప్పినవాళ్లు లేరు. నేను ఎంత సంపాదిస్తే అంతా ఖర్చయిపోయేవి. నా కెరీర్‌లో చేసింది 20 సినిమాలే. నాకు పెద్దగా డబ్బులు అవసరం లేదు. నా చుట్టూ చాలా మంది ఉంటారు. ఖర్చులుంటాయి. నేనెక్కడికీ ఒంటరిగా వెళ్లలేను. సెక్యూరిటీ కావాలి. అలాంటి కనిపించని ఖర్చులుంటాయి. అవన్నీ తడిసి మోపెడయ్యేవి. మనీ మేనేజ్‌మెంట్‌ విషయంలో జాగ్రత్తగా లేను.

చిరంజీవిది, మీది రాజకీయంగా వేర్వేరు దారులేనా?
రాజకీయంగా మా దారులు వేరే. కానీ... ఆయనంటే నాకు విపరీతమైన ప్రేమ. అలాగే, నాకున్న బాధ్యత కూడా పెద్దది. కుటుంబం మీద మమకారం ఉంది. అలాగని నా స్వార్థం కోసం ఏదోచేస్తే... నాకున్న పవిత్రమైన బాధ్యత, ఉద్దేశాలు దెబ్బతింటాయి. అన్నయ్యతో కొన్ని రాజకీయ విషయాలు మాట్లాడాను. వాటితో ఆయన ఏకీభవించారని చెప్పలేనుకానీ, అర్థం చేసుకున్నారు. జనసేనలోకి చిరంజీవి గారిని ఆహ్వానించలేను. మా ఇద్దరికీ కచ్చితమైన భావాలున్నాయి. ఆయన కాంగ్రె్‌సను ఎంచుకున్నారు. నేను వేరే దారి ఎంచుకున్నా.

విభజనపై ఏమంటారు?
ఈ విభజన సందర్భంగా ఏ ఒక్కరూ కూడా ప్రజల పక్షాన నిస్వార్ధంగా మాట్లడలేదని ఆయన అన్నారు. తాను చెప్పిన ఏ మాటా మర్చిపోలేదని ఆయన స్పష్టం చేశారు. గొడవ పెట్టుకుంటే వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు. తన మనసులో చాలా ప్రణాళికలు ఉన్నాయని, వాటిని వెల్లడించే సమయం కోసం చూస్తున్నానని ఆయన చెప్పాడు.

పంచెలూడదీసి తరిమి కొట్టాలి అనే మాటపై...!
(నవ్వుతూ) నేను పంచెలూడదీసి తరిమి కొట్టాలి అనలేదు... పంచెలూడిపోయేలా తరిమి కొట్టండి అని అన్నాను. దానికీ దీనికి చాలా తేడా ఉంది. కాంగ్రెస్‌ అప్పట్లో అధికార పార్టీ. కార్యాలయం కోసం స్థలం కావాలంటే ఎక్కడైనా తీసుకోవచ్చు. కానీ... భీమ్‌రావ్‌ వాడలోనే ఎందుకు తీసుకోవాలి? ఆ ఇళ్లన్నీ బలవంతంగా ఖాళీ చేయించారు. నాకు చాలా బాధ కలిగింది. వేరేచోట స్థలం ఇచ్చామన్నారు. అక్కడికీ వెళ్లి చూశాను. తన కూతురు స్నానం చేస్తుంటే అందరూ చూస్తున్నారని, ఎలాంటి వసతులు లేవని ఒక తల్లి వాపోయింది. ఈ ఆవేదన, బాధతోనే ఆ మాట అన్నాను. నిజానికి... నేను ఏ పార్టీకీ వ్యతిరేకం కాదు. చెప్పేది సూటిగా చెప్పాలి. నెహ్రూ అంటే నాకు గౌరవం. అలాంటి నాయకత్వం ఉన్న కాంగ్రెస్‌... ఇప్పుడు ఓటు బ్యాంకు, అధికారం కోసం రాజకీయాలు చేస్తోంది.

పీఆర్పీపై ఏమంటారు?
లక్ష్యం లేకుండా లేను. అధికారం రానంత మాత్రాన... మూటాముల్లె సర్దుకుపోవాలని, మొఖం చూపించొద్దన్నది నా ఉద్దేశం కాదు. 'స్టార్ట్‌ టు ఫినిష్‌' అని అంటారు. నేను ప్రజా సమస్యలపై పోరాటాన్ని నమ్ముతాను. అధికారం అనేది వాటి నుంచే ఉప ఉత్పత్తి. నాకు జనంలో ఉండటం ఇష్టం. పాదయాత్ర చేయాలా, బస్సు యాత్ర చేయాలో చేస్తాను. ఎలా చేస్తానన్నది చూడాలి!

2014లో మీరు కింగ్‌ మేకర్‌ అని ఒక విశ్లేషణ. 2019లో కింగ్‌ అవుతారా? కింగ్‌ మేకర్‌ అవుతారా?
అవేవీ ఆలోచించడంలేదు. ఇండిపెడెంట్‌గా ఉంటాను.

ఏపీలో టీడీపీకి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు?
(నవ్వుతూ) నాకు లెక్కలు సరిగా రావు. అయినా... మార్కులు ప్రజలే వేయాలి.

మీకు చాలా సిగ్గట.. కెమెరా ముందు అదంతా ఏమవుతుంది?
(నవ్వుతూ) కెమెరా ముందూ ఆ సిగ్గు ఉంటుంది. డ్యాన్స్‌ చేయాలన్నా, నటించాలన్నా సిగ్గే. రోడ్డు మీదకు తీసుకెళ్లి.. 'ఇక్కడో స్టెప్పు వేయండీ' అంటే కుచించుకుపోతా. అందుకే విదేశాల్లో ఎవరూ లేని చోట నాకు తోచిన స్టెప్పులేస్తా (నవ్వుతూ). కథకి అనుగుణంగా ఉందనిపించినప్పుడు మాత్రం నడిరోడ్డుపై సీన్‌ తీయాలన్నా అందుకు సిద్ధమవుతా. నా సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడటం నచ్చదు. 'మేం పొడిచేశాం.. ఇంత ఖర్చు పెట్టాం' అని చెప్పుకోలేను.

జేఎన్‌యూ, హెచ్‌సీయూ మీ స్పందన ఏమిటి?
సమాజంలో వివిధ స్థాయుల్లో కులవివక్ష ఉంది. దళితుల్లోనే దళిత దొరలు వేరని, ఇతర దళితులువేరని నాతో చెప్పిన వాళ్లున్నారు. ఒకే కులంలోనే ఇన్ని చీలికలు. మనది చాలా సంక్లిష్టమైన సమాజం. హెచ్‌సీయూలో చనిపోయింది ఒక తెలివైన విద్యార్థి. ఆయన మరణం బాధాకరం. దీనిని కేవలం కుల వ్యవస్థ దృష్టితో, ఒకే కోణంలో చూస్తే సమస్య పక్కదారి పడుతుంది. దీనిని సమగ్ర దృష్టితోనే చూడాలి.

రాజధానిపై మీ కామెంట్‌?
భూమి అనేది పరిమితమైన వనరు. దానిని ఉపయోగించుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఒకప్పుడు శ్రీశైలం అడవుల్లోకి వెళ్లిపోదామని అనుకున్నారట..!
మా అమ్మ ఇదే అంటుంటుంది. 'ఒరేయ్‌ బ్రహ్మచారిగా ఉండిపోదామనుకొన్నావ్‌. ఇన్ని పెళ్లిళ్లు చేసుకొన్నావ్‌..' అంటూ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది. జీవితమంటే అంతే. ఎప్పుడు ఎన్ని మలుపులు తీసుకొంటుందో చెప్పలేం. ఎలిజిబెత్‌ టేలర్‌ అన్ని పెళ్లిళ్లు చేసుకొందీ అంటే 'అలా ఎలా చేసుకొంటారో' అనుకొనేవాణ్ని. నా జీవితం అలానే అయ్యింది.

మార్షల్‌ ఆర్ట్స్‌పై ఆసక్తి ఎలా కలిగింది?
చిన్నప్పుడు శారీరకంగా బలం ఉండేది కాదు. కొంతమందిని కొట్టాలనిపించేది. కొట్టాలంటే బ్రూస్లీలా కరాటే నేర్చుకోలనుకోవడం తప్ప పెద్దగా తెలీదు. కనీసం ఎవడైనా కొడుతుంటే వాడి నుంచి కాపాడుకోవడానికైనా కొన్ని విద్యలు తెలుసుండాలి అనుకొన్నా. అలా నేర్చుకొన్నవే మార్షల్‌ ఆర్ట్స్‌. వీటిని నేర్చుకోవడం వల్ల సహనం పెరిగింది.

'భారత మాతాకీ జై'పైనా వివాదాలొచ్చాయి!
ఇది చాలా హాస్యాస్పదం. దేశంలో ఏ ప్రభుతత్వం ఉన్నా దేశ భక్తి ముఖ్యం. దేశంలో ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, మతాలు ఉన్నాయి. దేశ మంటే మాతృభూమి. భారతమాతాకీ జై అనడంలో తప్పేమీ లేదు. ప్రతి విషయాన్నీ వివాదం చేయకూడదన్నది నా అభిప్రాయం.

పార్టీలు మారే వారిపై మీరేమంటారు?
ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఈ పద్ధతిని ఎవరో ఒకరు మార్చాల్సిన అవసరం ఉంది. 'ఎవరో మార్చడం ఎందుకు? ఈ మార్పుకు నేనే నాంది పలుకుతా'. రాజకీయ నాయకులు ఎందుకు పార్టీలు మారుతున్నారో అందరికీ తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+