మునికోటి ఫ్యామిలికీ రూ.5లక్షలు: పవన్ కళ్యాణ్‌పై హోదా కోపం తగ్గేనా?
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానం చేసిన మునికోటి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మునికోటి కుటుంబానికి రూ.5 లక్షల మేర ఆర్థిక సాయం పవన్ ఇవ్వనున్నారు.
గత ఏడాది ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా తిరుపతిలో మునికోటి అనే యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతను ఆత్మబలిదానం చేసి ఏడాది పూర్తయింది.
మునికోటి ఆత్మబలిదానం చేసుకొని ఏడాది దాటిందని తెలిసిన పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబానికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు జనసేన కోశాధికారి రాఘవయ్యకు ఆదేశాలు జారీ చేశారు. అతను తిరుపతి వెళ్లి రూ.5లక్లను మునికోటి కుటుంబానికి ఇవ్వనున్నారు.

కాగా, ఏపీకి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు వివిధ రూపాల్లో పోరాడుతున్న విషయం తెలిసిందే. అధికార తెలుగుదేశం పార్టీ హోదా కోసం దేనికైనా సిద్ధమని బీజేపీ పైన నిప్పులు చెరుగుతోంది. ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు కూడా టిడిపి, బిజెపిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు ముందు తాము హోదా ఇస్తామని బీజేపీ ప్రకటించింది. అంతకుముందు, రాజ్యసభలో విభజన బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో నాడు బీజేపీ ఎంపీలుగా ఉన్న అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు వారే అధికారంలో ఉన్నా అది నెరవేరడం లేదు.
దీనిపై మిత్రపక్షం టిడిపితో పాటు విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. అదే సమయంలో 2014 సార్వత్రిక ఎన్నికలలో టిడిపి - బిజెపి కూటమికి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్‌ను కూడా నిలదీస్తున్నారు.
ప్రశ్నించేందుకు వచ్చానని చెప్పిన పవన్.. హోదా పైన బీజేపీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో హోదా కోసం ఆత్మబలిదానం చేసుకున్న మునికోటి కుటుంబానికి ఆయన ఆర్థిక సాయం.. విపక్షాల్లో, హోదా కోసం మండిపడుతున్న వారిని చల్లబరుస్తుందా చూడాలి.












Click it and Unblock the Notifications