పవన్‌కు గుండు కొట్టింది నిజమే: రోజా సంచలనం, జాగ్రత్తపడకపోతే మళ్లీ!
Recommended Video

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఇటీవలి 'ఛలోరే చలోరే చల్' పర్యటనలో 'గుండు' వివాదంపై ఎట్టకేలకు నోరు విప్పడం రాష్ట్రంలో పెద్ద చర్చకే దారి తీసింది.
పవన్ క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా గుండు వివాదాన్ని నిజమే అని నమ్ముతున్నవారూ లేకపోలేదు. ఇందులో నిజనిజాలు తెలిసిన వ్యక్తులు పవన్, పరిటాల ఇద్దరే కావడం.. అందులో ఒకరు ఇప్పుడు లేకపోవడంతో.. అసలు నిజమేంటోనని జనం చెవులు కొరుక్కుంటున్నారు.
అటు మీడియాలో, ఇటు జనంలో ఈ చర్చ కొనసాగుతుండగానే వైసీపీ ఎమ్మెల్యే రోజా మరో బాంబు పేల్చారు. ఓ టీవి చానెల్ తో మాట్లాడిన సందర్భంగా ఆమె పవన్ కళ్యాణ్ గుండు వివాదంపై స్పందించారు.

'గుండు' వాస్తవమే:
పవన్‌కు టీడీపీ గుండు కొట్టించిన మాట వాస్తవమేనని రోజా వ్యాఖ్యానించారు. ఆ సమయంలో తాను టీడీపీలోనే ఉన్నానని, కానీ ఆ సంఘటనతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
పవన చెప్పిన తేదీలను బట్టి చూస్తే గుండు కొట్టించిన మాట నిజమేనని రోజా వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, 2003లో తమ్ముడు సినిమా సమయంలో ఈ వివాదం తెర పైకి వచ్చినట్లుగా ఇటీవలి ప్రసంగాల్లో పవన్ ప్రస్తావించారు. కానీ తమ్ముడు సినిమా వచ్చింది 1999లో అయితే.. పవన్ తేదీని మార్చి చెప్పారనేది కొంతమంది వాదన.

మళ్లీ గుండు కొట్టించారు:
అప్పట్లో పరిటాల రవి గుండు కొట్టించడమే కాదు.. 2014లో పవన్ కళ్యాణ్ కు టీడీపీ మరోసారి గుండు కొట్టించిందని రోజా విమర్శించారు. 2019లోను టీడీపీ అదే పని చేయడం ఖాయమన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలుసుకుని జాగ్రత్తగా ఉంటే మేలు అని సలహా ఇచ్చారు.
వ్యక్తిగత దాడి:
పవన్ కళ్యాణ్ తన ఇటీవలి పర్యటనలో ఎక్కువగా తమ పార్టీనే టార్గెట్ చేయడంపై వైసీపీ గుర్రుగా ఉంది. తండ్రి సీఎం అయితే కొడుకు కూడా సీఎం కావాలా?, ప్రజాసేవకు సీఎం పదవే కావాలా? వంటి ప్రశ్నలు.. అవినీతి ప్రస్తావనలు పవన్ కళ్యాణ్ జగన్ ను ఉద్దేశించి చేసినవే. ఈ వ్యాఖ్యల పట్ల వైసీపీలో తీవ్ర అసహనం రేగింది. పవన్ కు కూడా గట్టిగానే కౌంటర్ ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. రోజా తాజా వ్యాఖ్యలను ఈ కోణంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో!

బండ్ల-రోజా వివాదం:
పవన్ కళ్యాణ్ విమర్శల సంగతి పక్కనపెడితే.. ఇటీవల బండ్ల గణేశ్ తో జరిగిన వాగ్వాదం రోజాలో మరింత అసహనం పెంచినట్లు కనిపిస్తోంది. చెప్పకూడని రీతిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
భవిష్యత్తులో వైసీపీ అవకాశాలను దెబ్బతీయడానికే జనసేన ప్రయత్నిస్తోందని ఆ పార్టీ భావిస్తోంది. కాబట్టి ఇప్పటినుంచే పవన్ కళ్యాణ్ ను ధీటుగా ఎదుర్కోవాలనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది. పవన్ గుండు వివాదంపై రోజా వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లు అనిపిస్తోంది.

భిన్నాభిప్రాయాలు:
పవన్ గుండుపై ఒక్కొక్కరిది ఒక్కో వాదన. ఆయన మద్దతుదారులు అదంతా వట్టి అసత్యమని కొట్టిపారేస్తుంటే.. ఆయనంటే గిట్టనివాళ్లు మాత్రం వాస్తవమేనంటున్నారు. అటు మంత్రి పరిటాల సునీత సైతం అలాంటిదేమి లేదన్నట్లుగానే స్పందించారు. పైగా మా ఆయన గుండు కొట్టించేంత మూర్ఖుడు కాదన్నారు. అయినా సరే, ఈ గుండు వివాదం ఇప్పట్లో తెరపడేట్లు లేదు.












Click it and Unblock the Notifications