మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్.. 9 రోజుల్లోనే..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు లైబ్రరీ, 25 కంప్యూటర్లను సొంత నిధులతో అందజేశారు. డిసెంబర్ 5వ తేదీన శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన టీచర్స్- పేరెంట్స్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యార్థుల అభ్యర్థన మేరకు లైబ్రరీ, 25 కంప్యూటర్లను తన సొంత నిధులతో అందజేస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాఠశాల విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. హామీ ఇచ్చిన తొమ్మిది రోజుల్లో 25 కంప్యూటర్లు, లైబ్రరీ నిండుగా పుస్తకాలు సమకూర్చారు. చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ 2.0 కు హాజరైన పవన్ కల్యాణ్ స్కూల్లో అందుబాటులో ఉన్న లైబ్రరీ, ల్యాబ్, పాఠశాల గదులను పరిశీలించారు.
బహు భాషా పుస్తకాలతో లైబ్రరీ నింపేశారు
పాఠశాలలో పుస్తకాలు అరకొరగా ఉండడాన్ని గమనించిన పవన్ కల్యాణ్ ఆ రోజు జరిగిన సమావేశంలో లైబ్రరీ నిండుగా పుస్తకాలు, 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తొమ్మిది రోజుల్లో కంప్యూటర్లతో అధునాతన స్కిల్ ల్యాబ్ ను ఏర్పాటు చేయించారు. లైబ్రరీని పుస్తకాలతో నింపేశారు. చిన్నారుల కోసం పెద బాలశిక్ష నుంచి కాశీమజిలీ కథల వరకు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు, బహుభాషా ప్రావీణ్యాన్ని పెంచే విధంగా స్పోకెన్ ఇంగ్లీష్, హిందీతోపాటు తమిళం, కన్నడ, ఒడియా తదితర భాషల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. సుమారు రూ. 25 లక్షలు వెచ్చించి వీటిని ఏర్పాటు చేయించారు.
ఈమేరకు డిసెంబర్ 15, సోమవారం రోజున చిలకలూరిపేట శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ శ్రీ కృష్ణతేజ, మాజీ శాసన సభ్యులు కిలారి రోశయ్య, కూటమి నాయకులు కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీలను ప్రారంభించి విద్యార్ధులకు అందుబాటులోకి తెచ్చారు. మాట ఇచ్చిన పది రోజుల్లోనే సొంత నిధులతో అమలు చేసి చూపించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సేవలను కొనియాడారు. విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరిచేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా చూపిన చొరవ ఆదర్శనీయమని అభిప్రాయపడ్డారు.

విద్యార్ధి దశ నుంచే బాలల్లో నైపుణ్యాన్ని వృద్ధి చేయాలి. పుస్తక పఠనంపై ఆసక్తి పెంచి సృజనాత్మకతను పెంపొందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతి సమావేశంలో చెబుతూ ఉంటారు. అందుకు తగిన విధంగా పాఠశాలల్లో సౌకర్యాల ఉండాలని కోరుకుంటారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన రోజు నుంచి తన సొంత నియోజకవర్గం పిఠాపురం వ్యాప్తంగా పాఠశాలల అభివృద్ధిపై సైతం దృష్టి సారించారు.
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి కంప్యూటర్ ల్యాబ్
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) December 15, 2025
•గ్రంథాలయం నిండుగా పుస్తకాలతో నింపేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
•మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఉపముఖ్యమంత్రి
•అందుబాటులోకి వచ్చిన 25 కంప్యూటర్ల అధునాతన స్కిల్ ఎడ్యుకేషన్ ల్యాబ్… pic.twitter.com/YMvczrpbYM
అంతేకాకుండా క్షేత్ర స్థాయి పర్యటనల ద్వారా పాఠశాలల్లో విద్యార్ధులకు అందుబాటులో ఉన్న వసతులపై ఆరా తీస్తూ ఉంటారు. రికార్డు స్థాయిలో గ్రామ సభల నిర్వహణ కోసం అన్నమయ్య జిల్లా మైసూరవారిపల్లి సందర్శించినప్పుడు ఆ గ్రామంలో పాఠశాలకు ఆట స్థలం లేదని తెలుసుకుని రూ.65 లక్షల తన సొంత నిధులను వెచ్చించి కొనుగోలు చేసి అందించారు. అంతేకాకుండా మొదటి విడత మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ కోసం కడప మున్సిపల్ స్కూల్ సందర్శన అనంతరం కలెక్టర్ సూచన మేరకు అధునాతన మోడల్ కిచెన్‌ను కూడా ఏర్పాటు చేయించారు.












Click it and Unblock the Notifications