బీజేపీ ముందు పవన్ కీలక ప్రతిపాదన - నడ్డా ఏం తేల్చారు..!?

జనసేనాని పవన్ బీజేపీ చీఫ్ తో సమావేశమయ్యారు. కీలక చర్చలు జరిపినట్లు పవన్ వెల్లడించారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండడంపైనే చర్చించామని చెప్పుకొచ్చారు. ఇది జనసేన ఎజెండా మాత్రమే కాదు.. బీజేపీ ఎజెండా కూడా అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్‌తో కీలక మంతనాలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం సాధించడానికి అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. ఏపీలో సుస్థిర పాలన ఏర్పాటే తమ లక్ష్యమని స్పష్టం చేసారు. జేపీ నడ్డా ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదన చేసారు. ఇదే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

బీజేపీ నేతలతో పవన్ మంతనాలు: ఢిల్లీ పర్యటనలో భాగంగా జనసేనాని పవన్ బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్‌తో రెండు విడతలుగా సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌తో సుదీర్ఘంగా చర్చించారు. ఆ సమయంలోనే రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులతో పాటుగా..వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి కీలక ప్రతిపాదనలు అందించినట్లు తెలుస్తోంది. పవన్ టీడీపీతో పొత్తుకు సిద్దమవుతున్న వేళ..బీజేపీని కూడా కలుపుకుని వెళ్లాలనే ఆలోచనతో చర్చల కోసమే ఢిల్లీకి వచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా.. బీజేపీ-జనసేన- టీడీపీ కలిసి 2014 తరహాలో పోటీ చేయటం ద్వారా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా.. అధికారంలోకి రావటానికి మార్గం సుగమం అవుతుందని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని తాము పార్టీ నాయకత్వానికి నివేదిస్తామని మురళీథరన్ స్పష్టం చేసారని సమాచారం.

Pawan Kalyan key proposal

నడ్డాతో భేటీ వేళ..కీలక ప్రతిపాదన: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ పవన్ ఏపీ రాజకీయాలపైన చర్చించారు. రాష్ట్రంలో తాను మిత్రపక్షంగా ఉన్నా..వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాలు ఇప్పటి వరకు చేయలేకపోవట వెనుక కారణాలను వివరించినట్లు తెలుస్తోంది. బీజేపీ వైసీపీ పైన పోరాటం చేయటానికి సిద్దంగా ఉంటే..తాను మరో పార్టీతో పొత్తు ప్రతిపాదన అవసరం ఉండదని పవన్ చెప్పినట్లుగా పార్టీలో ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే వ్యతిరేక ఓటు చీలకుండా 2014 తరహాలో పార్టీలు ఏకం కావాల్సిన అవసరాన్ని పవన్ వివరించారని సమాచారం. దీనికి స్పందనగా జేపీ నడ్డా తాము సొంతం గా ఎదగాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ - జనసేన కలిసి కీలక శక్తిగా ఎదగాలనేది తమ అభిమతంగా నడ్డా పేర్కొన్నట్లు సమాచారం. ఇదే సమయంలో రాజకీయంగా బీజేపీకి ఏది మేలు జరుగుతుందని భావిస్తే ఆ దిశగా అడుగులు వేస్తామంటూ నడ్డా స్పష్టత ఇచ్చారని తెలుస్తోంది.

2014 కూటమి మరోసారి సాధ్యమేనా: ఏపీలో తిరిగి టీడీపీ-బీజేపీ- జనసేన కలిసి పోటీ చేయాలని..వైసీపీని ఓడించాలనేది చంద్రబాబు - పవన్ కల్యాణ్ వ్యూహం. బీజేపీ మరోసారి టీడీపీతో జత కట్టేందుకు సిద్దంగా లేదని ఆ పార్టీ నేతలు పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి ఉన్న సమయంలోనే వారినీ తమతో కలిసి ప్రయాణం సాగించేలా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. బీజేపీ తమ నిర్ణయం చెప్పిన తరువాత పొత్తుల దిశగా పవన్ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ కలిసి వస్తే మూడు పార్టీలు..కలిసి రాకుంటే టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని జనసేన వర్గాల్లో చర్చ సాగుతోంది. కర్ణాటక ఎన్నికల తరువాత ఏపీలో నడ్డా పర్యటనకు వస్తారని..ఆ సమయంలో పొత్తులు..భవిష్యత్ కార్యాచరణ పైన స్పష్టత ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా పవన్ సైతం బీజేపీ నేతలతో అన్ని కోణాల్లో చర్చించామని.. ఇవి సత్ఫలితాలిచ్చాయని.. అవి ఎలా ఉంటాయో రాబోయే రోజుల్లో తెలుస్తుందని చెప్పటం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+