Pawan Kalyan : బీజేపీతో తాడో పేడో- హస్తినలో తేల్చేస్తున్న పవన్-ఈ సాయంత్రం కీలక ప్రకటన ?
ఏపీలో మూడేళ్లుగా బీజేపీతో కలిసి కాపురం చేస్తున్నా అంటీ ముట్టనట్టుగా ఉంటూ, కాషాయ నేతల తీరుపై అసంతృప్తిగా కనిపిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. ఇవాళ వరుసగా రెండోరోజు ఢిల్లీ నేతలతో సమావేశమవుతున్నారు. పార్టీలో నంబర్ టూ గా ఉన్న నాదెండ్ల మనోహర్ తో కలిసి బీజేపీ నేతలతో ఆయన భేటీ అవుతున్నారు. నిన్న ఓసారి బీజేపీ ఏపీ ఇన్ ఛార్జ్ మురళీధరన్ తో భేటీ అయిన పవన్.. ఇవాళ మరోసారి కలిసి చర్చలు జరుపుతున్నారు.
ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో బీజేపీతో తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్న పవన్.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలపై కాషాయ నేతలతో చర్చిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్.. ఈ క్రమంలో తమతో కలిసి వస్తారా లేదా అన్న దానిపై కాషాయ నేతలతో క్లారిటీ కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ఎన్నికల తర్వాత దీనిపై క్లారిటీ ఇస్తామని బీజేపీ నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది. కానీ అంతవరకూ వేచి చూసే ఆలోచనలో పవన్ లేనట్లు సమాచారం.

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నాలుగు సీట్లు కోల్పోయిన నేపథ్యంలో తాజా పరిస్ధితుల్ని సొమ్ము చేసుకునేందుకు బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి ఏర్పాటు ముఖ్యమని పవన్ భావిస్తున్నారు. ఇప్పుడు కూటమి ఏర్పాటు చేసుకుంటే వచ్చే ఏడాది కల్లా పూర్తిస్ధాయిలో వైసీపీపై పైచేయి సాధించవచ్చని అనుకుంటున్నారు. అయితే బీజేపీ నేతలు దీనికి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇవాళ చివరి ప్రయత్నం చేసి అప్పటికీ వారు ఒప్పుకోకపోతే తాను టీడీపీతో ముందుగా జట్టు కట్టే అంశాన్నీ పవన్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇవాళ బీజేపీ ఏపీ ఇన్ ఛార్జ్ మురళీధరన్ తో రెండోసారి భేటీ తర్వాత సాయంత్రం అమిత్ షా, జేపీ నడ్డాలతో పవన్ భేటీ కాబోతున్నారు. వారితో చర్చల తర్వాత పొత్తులపై ఓ క్లారిటీ వస్తుందని జనసేన నేతలు కూడా అంచనా వేస్తున్నారు. ఈ మేరకు వారితో చర్చలు ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన చేసే అవకాశముంది. ఇవాళ ఉదయం కూడా ఢిల్లీలో తనను కలిసిన మీడియా ప్రతినిధులోత చర్చలు ముగిశాక క్లారిటీ ఇస్తానని పవన్ సూత్రప్రాయంగా చెప్పారు. దీంతో పవన్ సాయంత్రం చేసే ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications