వంశీకి ఓటు వేస్తే.. పవన్ హెచ్చరిక..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా మారింది. ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రధాని మోడీ పర్యటన ఏపీలో కొనసాగుతుంది. జనసేనని పవన్ కళ్యాణ్ గన్నవరంలో పర్యటించారు. అక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈసారి ఎన్నికల్లో గన్నవరం రాజకీయం ఆసక్తికరంగా మారింది. అక్కడ గెలుపు కోసం టిడిపి చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తుంది. వైసిపి అభ్యర్థి వంశీని ఓడించే లక్ష్యంతో ముందుకు వెళుతుంది. మరోవైపు వంశీ తన గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో గన్నవరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీ వివేకం కలిగిన నాయకుడని తాను అనుకున్నానని పాలసీలపరంగా విభేదాలుంటే మాట్లాడవచ్చని చెప్పుకొచ్చారు. అయితే దానికి ఒక పరిమితి ఉంటుందన్నారు.

ఎన్నికల్లో ఎంపీ జనసేనకు, ఎమ్మెల్యే ఓటు తనకు వేయాలని కోరుతున్నట్లు తెలిసిందన్నారు. ఇది సరికాదని సూచించారు. ఎన్టీఆర్ కుమార్తె పై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయన్నారు. వంశీకి జనసేన శ్రేణులు ఓట్లు వేస్తే అవి మహిళను అగౌరపరిచే వారిని ప్రోత్సహించటం అవుతుందని వ్యాఖ్యానించారు. ఈసారి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని పవన్ సూచించారు. ఆత్మగౌరవం తాకట్టు పెట్టలేని వైసీపీ నేతలు వస్తున్నారని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ వ్యవహార శైలి పైన పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్కు తన సంపాదన మినహా సామాన్యుల బాధలు పట్టవని ఆరోపించారు. ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూటమి బాధ్యతగా చెప్పారు. ఉపాధి అవకాశాలు, ప్రజా సంక్షేమం, బాధ్యతాయుతమైన పాలన కావాలంటే కూటమికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా తాను బాధ్యత తీసుకుంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications