ప్రధానితో పవన్ భేటీ - బీజేపీ మార్క్ గేమ్ షురూ..!!
ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కేంద్రం జమిలి దిశగా కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి బిల్లు ప్రతిపాదించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో విజయం తరువాత బీజేపీ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ సమయంలోనే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీలో ప్రధానితో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఎన్డీఏ భవిష్యత్ రాజకీయా వ్యూహాల్లో పవన్ పాత్ర కీలకం కానుందనే అంచనాలతో ఈ భేటీ ఆసక్తిని పెంచుతోంది.
ఢిల్లీలో పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో పవన్ సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన అంశాల పైన చర్చలు చేసారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా పవన్ కు కేంద్రం మంత్రుల నుంచి సానుకూల స్పందన కనిపిస్తోంది. పవన్ అభ్యర్ధనల పైన కేంద్ర మంత్రులు వెంటనే స్పందించి ఆమోదం తెలుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ప్రధానితో భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. హర్యానాలో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సమయంలో ప్రధానిని పవన్ కలిసారు. ఆ తరువాత ఇప్పుడు పవన్ భేటీ కానున్నారు.

ప్రధానితో భేటీ
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు.. కేంద్రం జమిలి దిశగా అడుగులు వేస్తున్న వేళ వ్యూహాత్మకంగా నే ఈ భేటీ ఖరారు అయినట్లు తెలుస్తోంది. పవన్ ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం ఇవ్వటం ద్వారా రానున్న రోజుల్లో పవన్ సేవలను ఎన్డీఏ బలోపేతానికి వినియోగించుకోవాలనేది బీజేపీ వ్యూహం గా స్పష్టం అవుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్ధులకు మద్దతుగా పవన్ ప్రచారం చేసారు. ఆ సమయంలో వచ్చిన స్పందన పైన బీజేపీ ముఖ్య నేతలు ఆరా తీసారు. ప్రధాని మోదీ పైన పవన్ పలు సందర్భాల్లో విధేయత చాటుకున్నారు. ఇక..డిప్యూటీ సీఎం అయిన తరువాత ఆ హోదాలో ప్రధానితో ఒన్ టు ఒన్ సమావేశం కావటం ఇదే తొలి సారి. పవన్ ను దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రచార కర్తగా వినియోగించుకోవాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.
పవన్ కు బాధ్యతలు
దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలో మాత్రమే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. తమిళనాడులో బీజేపీ గత ఎన్నికల్లో బలం పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. కానీ, సఫలం కాలేదు. కొద్ది నెలల క్రితం పవన్ సనాతన ధర్మం పేరుతో చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చగా మారాయి. ఆ సమయంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు. అటు కర్ణాటకలోనూ పవన్ కు అభిమానులు ఉన్నారు. ఇక.. తెలుగు రాష్ట్రం తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల నాటికి అధికారం దక్కించుకునే దిశగా బలం పెంచుకోవాలని బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో, దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజాకర్షణ ఉన్న పవన్ కు కీలక పదవి అప్పగిస్తారని తెలుస్తోంది. ఈ అంచనాల వేళ ప్రధానితో పవన్ భేటీ ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications