మోడీ వద్దకు వెళ్దామా!: పవన్‌కు బాబు స్వాగతం, హైదరాబాద్ సహా వీటిపై చర్చ
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో భేటీ అయ్యారు. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. వారు దాదాపు గంటపాటు పలు అంశాలపై చర్చించనున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడనున్నారు. చంద్రబాబు - పవన్ కళ్యాణ్ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. రైతు సమస్యలు, రాజధాని అమరావతి భూసమీకరణ, ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు.. ఇలా పలు రాజకీయ అంశాలు చర్చకు రానున్నాయి.

జిహెచ్ఎంసీ ఎన్నికలు
రానున్న ఒకటి రెండు నెలల్లో హైదరాబాదులో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు (జిహెచ్ఎంసీ) జరగనున్నాయి. ఇటీవలే జనసేన పార్టీకి తెలంగాణలో ఎన్నికల కమిషన్ గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ విషయమై చంద్రబాబుతో చర్చిస్తుండవచ్చునని అంటున్నారు.
అమరావతికి భూసేకరణ
ఏపీ రాజధాని అమరావతి కోసం ఇంకా భూమి కావాల్సి ఉంది. దీని కోసం ప్రభుత్వం భూసమీకరణకు జీవో జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. దీని పైన కూడా పవన్ కళ్యాణ్.... చంద్రబాబుతో చర్చిస్తున్నారు. గతంలో ఓసారి భూసమీకరణ నోటిఫికేషన్... పవన్ కళ్యాణ్ వల్ల వెనక్కి తీసుకున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కూడా చంద్రబాబు - పవన్ కళ్యాణ్ మధ్య చర్చకు వస్తుందని చెబుతున్నారు. ఇరువురు కలిసి ప్రధాని మోడీ వద్దకు వెళ్లే అంశంపై ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. వీటితో పాటు మరిన్ని రాజకీయ అంశాలపై చర్చిస్తున్నారని తెలుస్తోంది.
రైతు బిడ్డగా.. పంచెకట్టుతో
పవన్ కళ్యాణ్ రైతు బిడ్డగా పంచెకట్టుతో సీఎం క్యాంప్ ఆఫీస్‌లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా రాజధాని రైతుల అంశాలపై చర్చిస్తారని చెబుతున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సమయంలో పవన్ షూటింగ్‌లో ఉన్న కారణంగా గైర్హాజరైన విషయం తెలిసిందే.
పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు స్వాగతం
భేటీ కోసం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో సాదరంగా స్వాగతం పలికారు.
గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ముందే తన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు అక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. అనంతరం చర్చలు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications