పొత్తులపై పార్టీ కేడర్ ను అప్రమత్తం చేసిన పవన్ - కీలక సందేశం..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం కీలక దశకు చేరుకుంది. పొత్తుల వ్యవహారం ఇప్పుడు ఎన్నికల్లో కీలకంగా మారుతోంది. వైసీపీ తమ అభ్యర్దులను దాదాపు ఖరారు చేసింది. టీడీపీ, జనసేన నుంచి ఆశావాహులు తమ సీట్ల ఖరారు కోసం వేచి చూస్తున్నారు. చంద్రబాబు, పవన్ ఇప్పటికే సీట్ల సర్దుబాటు పైన ఒక అంచనాకు వచ్చారు. ఈ సమయంలో బీజేపీతో చర్చల ద్వారా ఆ పార్టీ తుది నిర్ణయం స్పష్టం కావాల్సి ఉంది. ఈ సమయంలోనే పార్టీ నేతలను పవన్ అప్రమత్తం చేసారు.
పొత్తుల లెక్కలు : ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. ఇప్పుడు బీజేపీ కలిసి వస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి 2014 ఎన్నికల పొత్తులను తిరిగి కొనసాగించాలని భావిస్తున్నారు. దీని పైన ఇప్పటికే ఢిల్లీలో అమిత్ షా తో చంద్రబాబు భేటీ అయ్యారు. సీట్ల పైన స్పష్టత వచ్చిన తరువాత పొత్తు పైన అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. ఇక, జనసేనకు 25-27 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు ఖాయమైనట్లు తెలుస్తోంది. బీజేపీ తమకు 6-8 ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీకి 10 అసెంబ్లీ, 3 ఎంపీ ఇస్తామని టీడీపీ నుంచి సమాచారం ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది.

2014 పొత్తులు రిపీట్ : ఇప్పుడు ఈ సీట్ల పైన బీజేపీ నేతలు అంగీకరిస్తే పొత్తు పైన సానుకూల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సమయంలోనే జనసేనాని పవన్ కల్యాణ్ పొత్తుల అంశం పైన కేడర్ ను అప్రమత్తం చేసారు. కీలక సందేశం ఇచ్చారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తులని స్పష్టం చేసారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు వద్దని సూచించారు. జన హితానికి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేసారు. ఈ దిశగానే పొత్తులతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగానికి లోనై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని సూచించారు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలను ప్రచారం చేయవద్దని పవన్ కోరారు.

పవన్ సూచన : ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారవుతారని పవన్ హెచ్చరించారు. ఇందుకు సంబంధించి అభిప్రాయాలు, సందేహాలు ఉంటే తన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ కు సూచించవచ్చని చెప్పారు. పొత్తులపై పార్టీ విధానాలకు విరుద్దంగా ప్రకటనలు చేసే నాయకుల నుంచి వివరణ తీసుకోవాల్సిందిగా పార్టీ నాయకత్వాన్ని పవన్ ఆదేశించారు. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు భావించినా ప్రజలు గమనిస్తారని చెప్పుకొచ్చారు. ప్రజలు స్థిరత్వాన్ని ఆకాంక్షిస్తున్నారన్నారు. ఈ సమయంలో పార్టీ కేడర్ అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పవన్ సూచించారు.












Click it and Unblock the Notifications