అందుకే మోడీకి మద్దతిచ్చా, బాబుకు చేయాలని ఉన్నా: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: దేశానికి మంచి నాయకుడు అన్న ఒకే ఒక కారణంతో తాను నరేంద్ర మోడీకి నాడు మద్దతు పలికానని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పారు. తనకు బిజెపిలో చేరే ఉద్దేశ్యం ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు.
తన తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో కులం పైన చెప్పిన డైలాగులు కేవలం సినిమా కోసమేనని, అవి తన వ్యక్తిగత అభిప్రాయాలుగా తీసుకోవద్దని కోరాడు. తాను జనసేన పార్టీని ప్రకటించిన సమయంలో కాపుల రిజర్వేషన్ అంశం తెరపై లేదని, ఉంటే అప్పుడే తన వైఖరిని బయటపెట్టి ఉండేవాడినని చెప్పారు.

ఎప్పుడూ తన వ్యాఖ్యలు, కామెంట్లతో వివాదాలు సృష్టిస్తుండే దర్శకుడు రాంగోపాల్ వర్మపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్మ ఫ్రస్టేషన్లో ఉన్నాడన్నారు. ఆయన కామెంట్లను విని నవ్వుకుంటానని తెలిపారు. వర్మ కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలన్న తపన ఏపీ సీఎం చంద్రబాబులో ఉన్నప్పటికీ, ఆయన చుట్టూ ఉన్న వ్యవస్థ ముందుకు సాగనీయడం లేదని అభిప్రాయపడ్డారు. ఆయన మీద తనకు మిశ్రమ అభిప్రాయాలే ఉన్నాయన్నారు. తనకు వచ్చే ఫీడ్ బ్యాక్‌ను బట్టి, ఆయనకు చేయాలని ఉందని, ఆ ప్రయత్నం చేస్తున్నారన్నారు. అదే సమయంలో చేయలేకపోతున్నానని బాధ పడుతున్నారని కూడా తెలుస్తోందన్నారు.












Click it and Unblock the Notifications