ఉగాదే డెడ్ లైన్.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు !!
ఆంధ్రప్రదేశ్‌ను పచ్చదనంతో పరవళ్లు తొక్కించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేయనుంది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం, పచ్చదనాన్ని దీర్ఘకాలికంగా పెంచే లక్ష్యంతో రూపొందించిన '50% గ్రీన్ కవర్' బృహత్ ప్రాజెక్టును వచ్చే ఉగాది పండుగ నుంచే అమలు చేయాలని.. ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సంబంధించిన వివరమైన కార్యాచరణ ప్రణాళికలను పండుగలోపే సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
మంగళవారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖలతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో పవన్ విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని ఆయన తెలిపారు. ఇది కేవలం మొక్కలు నాటే కార్యక్రమం మాత్రమే కాకుండా.. భవిష్యత్ తరాల కోసం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక ఉద్యమమని ఆయన అభివర్ణించారు.

2047 నాటికి రాష్ట్ర భూభాగంలో 50 శాతం పచ్చదనాన్ని సాధించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ప్రస్తుతం ఉన్న సుమారు 30 శాతం గ్రీన్ కవర్‌ను వచ్చే నాలుగేళ్లలో 37 శాతానికి పెంచాలని ప్రభుత్వం సంకల్పించిందని పవన్ కల్యాణ్ వివరించారు. ఇందుకోసం 9 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు నాటే ప్రణాళికను అమలు చేయనున్నారు.
ఈ బృహత్ పచ్చదనం యజ్ఞంలో అన్ని ప్రభుత్వ శాఖలు త్రికరణశుద్ధిగా పాల్గొనాలని పవన్ కల్యాణ్ సూచించారు. పరిశ్రమల శాఖ కాలుష్య నియంత్రణకు అనుకూలమైన మొక్కలను పరిశ్రమల పరిసరాల్లో నాటాలని, తీర ప్రాంతాల్లో ఉప్పు నీరు, పెనుగాలులను తట్టుకునే స్థానిక జాతి మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా 'గ్రేట్ గ్రీన్ వాల్' ప్రాజెక్టును మరింత సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
వ్యవసాయ రంగానికి అనుసంధానంగా కూడా గ్రీన్ కవర్ ప్రణాళికలు ఉండాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రైతుల భూముల్లో దీర్ఘకాలిక ఆదాయం అందించే పండ్ల తోటలు, కాలువ గట్ల వెంట, రహదారుల పక్కన మొక్కలు నాటేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. దీనివల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు ఆర్థిక ప్రయోజనాలు కూడా చేకూరుతాయని అన్నారు.
ఈ ప్రాజెక్ట్ అమలుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. అవసరమైన నిధులు, మానవ వనరులు, సాంకేతిక సహకారం అన్నీ సమీకరించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 5న జరిగే తదుపరి సమీక్షా సమావేశానికి పూర్తి స్థాయి, శాఖల వారీ కార్యాచరణ ప్రణాళికలతో హాజరుకావాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖలతో పాటు పలు ముఖ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారు. '50% గ్రీన్ కవర్' ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి పర్యావరణ మోడల్‌గా నిలపాలనే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సమావేశం స్పష్టంగా చూపిస్తోంది.












Click it and Unblock the Notifications