అమరావతి రైతుల పాదయాత్రలో పవన్‌కల్యాణ్?
రాజధాని అమరావతి రైతులు చేసే ప్రతి కార్యక్రమానికి జనసేన మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రైతులకు తమ పార్టీ పూర్తిస్థాయిలో మద్దతుగా ఉంటుందని, భవిష్యత్తులో తమ పార్టీ తీసుకోబోయే నిర్ణయాలు కూడా రైతుల పక్షానే ఉంటాయని స్పష్టం చేశారు. సెప్టెంబరు 12వ తేదీ నుంచి అసెంబ్లీ నుంచి అరసవెల్లి వరకు తలపెట్టబోతున్న 60 రోజుల మహా పాదయాత్రకు మద్దతివ్వాలని రైతులు పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. జనసేన నాయకులు కూడా పాదయాత్రలో పాల్గొంటారని, వారికి అడుగడుగునా మద్దతు తెలియజేస్తారన్నారు. పాదయాత్రలో మీరు కూడా పాల్గొనాలంటూ రైతులు కోరగా సమయాన్నిబట్టి పాల్గొంటానని వారికి హామీ ఇచ్చారు.

రాజధానిగా అమరావతే ఉంటుందని, అందులో ఎటువంటి సందేహం అవసరంలేదని పవన్ వారికి భరోసా ఇచ్చారు. కొందరు నేతలు తీసుకున్న స్వార్థ నిర్ణయాలకు, విచ్ఛిన్నకర ధోరణులకు అమాయక రైతులు బలవుతున్నారని, ఇకనుంచి అటువంటి పరిస్థితి రానివ్వకుండా జనసేన అండగా నిలబడుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను సెప్టెంబరు 12వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నామని, ఆరు జిల్లాల్లో 60 రోజులపాటు యాత్ర సాగనుందని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు తిరుపతిరావు వెల్లడించారు. డీజీపీ కార్యాలయానికి విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తామని, అక్కడి నుంచి అనుమతి రాకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications