పిఠాపురంలో జనసేనకు డేంజ'రెబల్స్'.. కొత్త బాధ్యతల్లో వర్మ - మారుతున్న లెక్కలు..!!
స్థానిక ఎన్నికల వేళ కొత్త రాజకీయం చోటు చేసుకుంటోంది. సమీకరణాలు మారుతున్నాయి. ఆసక్తి కర లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. నవంబర్ 1వ తేదీన మున్సిపల్ పోలింగ్ జరగనుంది. కాగా, ప్రచారం ఊపందుకుంది. జగన్ ఇలాకాలో టీడీపీ పలు స్థానాలు ఏకగ్రీవంగా గెలిచింది. ఇక, పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో పోలింగ్ సమీపిస్తున్న వేళ లెక్కలు మారిపోతున్నాయి. పోటీ లో ఉన్న రెబల్స్ తో సమస్యగా మారుతోంది. ఇక్కడ ఆసక్తి కర రాజకీయం నెలకొంది.
డిప్యూటీ సీఎం పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురం మున్సిపల్ ఎన్నికల బరిలో కూటమి అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపు తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. జనసేన అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో టీడీపీ తో సహా స్థానికంగా కూటమిలోని అసంతృప్తులు రెబల్స్‌గా పోటీకి దిగటంతో రాజకీయం హీటెక్కింది. పిఠాపురం, గొల్లప్రోలులోనూ రెబల్స్ పోటీలో ఉన్నారు. పిఠాపురం మున్సిపాల్టీలో పది వార్డుల్లో జనసేనకు 10 మంది రెబల్స్ తేలారు.

ఎనిమిది వార్డుల్లో టీడీపీ రెబల్స్ బరిలో కొనసాగుతున్నారు. గొల్లప్రోలు మున్సిపాల్టీ పరిధిలో ఏడు వార్డుల్లో జనసేనకు రెబల్ అభ్యర్థుల తలనొప్పి ఏర్పడింది. టీడీపీకి ఒక వార్డులో రెబల్ నిలిచారు. పిఠాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా జనసేన అధిష్టానం చివరి నిమిషంలో దానం లాజర్ బాబు పేరును అధికారికంగా ప్రకటించింది.
అయితే, ఈ సీటును ఆశించి తన ప్రభుత్వ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిన డాక్టర్ బీర విజయ్ శేఖర్ తీవ్ర అసంతృప్తికి లోనై రెబల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ టీడీపీ తాజాగా నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్థానిక ఎన్నికల వేళ సేవలు అందిస్తున్నారు. వర్మ మద్దతు దారులు జనసేనతో పూర్తి స్థాయిలో మమేకం కావటం లేదు.
దీంతో... ఇప్పుడు జనసేన శ్రేణులు పూర్తి పవన్ కు ఉన్న ఆదరణ.. ఈ రెండున్నారేళ్ల కాలంలో పిఠాపురంలో చేసిన పనులు తమను గెలిపిస్తాయనే ధీమా తో ఉన్నారు. అటు వైసీపీ ఛైర్మన్ అభ్యర్ధి స్థానికంగా ఉన్న పట్టు... పరిచయాలతో ముందుకు వెళ్తున్నారు. వైసీపీ నుంచి నలుగురు రెబల్స్ పోటీ చేస్తున్నారు. ఈ స్థాయిలో రెబల్స్ బరిలో ఉండటంతో.. ఇక్కడ తుది ఫలితం పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications
