శేషాచలం అడవుల్లో పవన్- ఎర్రచందనం గోడౌన్ల తనిఖీలు..! ఒక్క దుంగ కూడా...!
ఏపీలో ప్రభుత్వాలు మారుతున్నా శేషాచలం కొండల్లో దొరికే ఎర్ర చందనం అక్రమ రవాణాను ఎవరూ ఆపలేని పరిస్ధితి. పుష్ప సినిమాలో చూపించిన విధంగానే పోలీసుల్ని, ప్రభుత్వాల్ని మేనేజ్ చేస్తూ యథేచ్ఛగా అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పరిస్ధితుల్లో మార్పు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కమ్ అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు.
తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అడవిలో నాలుగు కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునీ పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం మొత్తం పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందనే వివరాలు తెలుసుకున్నారు.

గుంటిమడుగు వాగు ఒడ్డున కూర్చుని, పరిసరాలను పవన్ ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరు వైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు. ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్ కు పవన్ బయలుదేరి వెళ్లారు. అక్కడ మొత్తం 8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఎ,బి, సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలు తీసుకున్నారు. అనంతరం ప్రతి గోడౌన్ లో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అటవీశాఖ అధికారులను పవన్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications