పవన్ క్లియర్ గా చెప్పేసారు : ఇక నిర్ణయం చంద్రబాబు - బీజేపీదే..!!
ఏపీలో పొత్తు రాజకీయాల వేళ పవన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తన లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు. వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తానంటూ సవాల్ చేసారు. తాను వైసీపీని కొట్టాలంటే ప్రధానికి చెప్పి చేయనని వ్యాఖ్యానించారు. పరోక్షంగా కొద్ది రోజులు ప్రధాని - పవన్ భేటీ పైన జరుగుతున్న ప్రచారం పైన స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో వచ్చే ఎన్నికలు కీలకమైనవని చెబుతూనే.. వ్యూహాత్మకంగా, ఆచితూచి అడుగులు వేస్తానని వెల్లడించారు. తన భవిష్యత్ అడుగులు వ్యూహాత్మకంగా ఉంటాయంటూనే 2024 తో పాటుగా 2029 ఎన్నికలను ప్రస్తావిస్తున్నారు. దీంతో, ఇప్పుడు అసలు పవన్ ఏం తేల్చారు. ఆయన వ్యాఖ్యల వెనుక సారాంశం ఏంటనే చర్చ మొదలైంది.

ప్రధానితో భేటీపైన క్లారిటీ వచ్చినట్లేనా...
విశాఖలో ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ తరువాత రాజకీయంగా అనేక చర్చలు తెర మీదకు వచ్చాయి. టీడీపీతో ఇక పవన్ కలవరనే చర్చ మొదలైంది. బీజేపీ - జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయంటూ కమలం పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ, పవన్ కల్యాణ నుంచి దీని పైన ఈ రోజు సమావేశంలో క్లారిటీ వచ్చింది. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పవన్ సుదీర్ఘ ప్రసంగం చేసారు. ప్రధానితో తాను ఎవరి పైనా చాడీలు చెప్పలేదన్నారు. ప్రధానితో మాట్లాడిన ప్రతీ సందర్భంలోనూ దేశ భవిష్యత్..సమగ్రత గురించే మాట్లాడానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో వైసీపీని దెబ్బ కొట్టే విషయంలో ప్రధానికి చెప్పి చేయనని పవన్ వ్యాఖ్యానించారు. దీని ద్వారా తాను ప్రధాని చెప్పిన విధంగా.. బీజేపీ నిర్దేశించిన విధంగా పని చేయనని స్పష్టం చేసారు. వైసీపీ 175 సీట్లు గెలిస్తూ చూస్తూ కూర్చుంటామా అని ప్రశ్నించిన పవన్ .. ఎలా గెలుస్తారో చూస్తామంటూ సవాల్ చేసారు. దీని ద్వారా వైసీపీ ఓటమే తన లక్ష్యమని పవన్ మరోసారి తేల్చి చెప్పారు.

2024-2029 ఎన్నికల ప్రస్తావన- లక్ష్యం మారిందా..
పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వననేది నిత్యం వినిపించే నినాదం. కానీ, ఇప్పుడు ఆ స్లోగన్ మారింది. 2024-2029 ఎన్నికలు తన పార్టీకి కీలకమని పవన్ చెబుతున్నారు. దీని ద్వారా బీజేపీ చెబుతున్న మిషన్ 2029 లక్ష్యంతో పవన్ ఏకీభవిస్తన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. టీడీపీ 2024 ఎన్నికల్లో ఓడిపోతే అవే ఆ పార్టీకి చివరి ఎన్నికలంటూ స్వయంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో, టీడీపీఈ ఎన్నికల్లో ఓడితే..ఆ స్పేస్ తమ భర్తీ చేయాలనేది బీజేపీ వ్యూహం. ఇందుకు పవన్ సహకారం అవసరం. ఆ ఉద్దేశంతోనే 2024 లో ఎవరు గెలిచినా.. 2029 లో మాత్రం బీజేపీ - జనసేన అధికారంలోకి రావటం ఖాయమని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ ఇప్పుడు చంద్రబాబుతో కలిసినా.. చంద్రబాబు సీఎం అవుతారని.. పవన్ భవిష్యత్ అవకాశాలు కోల్పోతారనేది బీజేపీ నేతల అంచనా. ఈ వ్యూహంలో భాగంగానే పవన్ కూడా కొత్తగా 2024, తో పాటుగా 2029 ఎన్నికల గురించి ఇప్పుడే ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో 2024లో వైసీపీ అధికారంలోకి రాకుండా చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఒంటరి పోరాటం - పొత్తు లేదనే సంకేతాలు..
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో జనసేన రాష్ట్రంలో ఒంటరిగా ఎదగాలనే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నా యుద్దం నేను చేస్తానంటూ పవన్ చెప్పటం ఇందులో భాగమే. 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకే సిద్దం అవుతున్నట్లుగా పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. అందులో భాగంగా.. అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీకి సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో టీడీపీతో దూరంగా ఉండాలని బీజేపీ కోరుతున్న సమయంలో..తాను బీజేపీకి కూడా దూరంగా ఉండబోతున్నాననే సంకేతాలు పవన్ ఇచ్చారు. దీంతో, 2029 నాటికి ఏపీలో బలమైన పార్టీగా అధికారంలోకి రావటం ఖాయమనే అంచనాలతో పవన్ ఉన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, టీడీపీతో పొత్తు లేకపోతే..వైసీపీ వ్యతిరేక ఓటు చీలి తిరిగి జగన్ కు ఎన్నికల్లో కలిసొచ్చే అవకాశం ఉందనేది మరో వాదన. దీంతో, బీజేపీ - టీడీపీ రెండు పార్టీలు కలిసి వస్తే ఓకే..లేకపోతే రెండు పార్టీలకు దూరంగా ఉండి..ఎన్నికల వరకు ఒత్తిడి కొనసాగించే వ్యూహంలో పవన్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications