ఇదీ పవన్ కళ్యాణ్: బరిలోకి దిగకుండానే గెలుపు, ఢీకొట్టగలరా?
విజయవాడ/హైదరాబాద్: తాను 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని, రెండు తెలుగు రాష్ట్రాలలోను పోటీ చేస్తానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం చెప్పారు. ఆయన ఆరంగేట్రం పైన ఇంకా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో పవన్ రాజకీయాల్లో నెట్టుకు రాగలరా అనే చర్చ కూడా సాగుతోంది.
పవన్ కళ్యాణ్ తెలంగాణ, ఏపీలలో పోటీ చేస్తానని చెప్పారు. కానీ తెలంగాణలో పెద్దగా ఆయన గురించి చర్చ జరగడం లేదు. కానీ ఏపీలో మాత్రం ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. అందుకు ఆయన ఏపీ పైనే ఎక్కువ దృష్టి పెడతారనే అభిప్రాయం, కుల సమీకరణాలు ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తారు? ఎవరిని దెబ్బతీస్తారు? 2019లోను టిడిపి - బిజెపి కూటమికి మద్దతిస్తారా? అనే చర్చ జరుగుతోంది. పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ ఆరంగేట్రం పైన లెక్కలు వేసుకుంటున్నాయి. మూడేళ్ల తర్వాత వస్తానని పవన్ చెప్పడేమేమో కానీ ఆసక్తికర చర్చ మాత్రం కొనసాగుతోంది. ఎన్నికల కోసం ఆయన ఇప్పటికే ఈ రెండు మూడేళ్లలో మూడు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

సూటిగా మాట్లాడుతారు
పవన్ కళ్యాణ్ సూటిగా మాట్లాడే వ్యక్తి. చిన్నప్పటి నుంచి ఎన్నో పుస్తకాలు చదువుతారు. ప్రజలకు ఏదో చేయాలనే తపన ఆయనలో కనిపిస్తోందని సన్నిహితులు అంటుంటారు. ఇలా సూటిగా మాట్లాడే వ్యక్తి రాజకీయాల్లో రాణించగలరా అనే చర్చ సాగుతోంది.

ఆవేశపూరిత ప్రసంగాలు
పవన్ కళ్యాణ్‌లో ఆవేశ కోణం కూడా ఉంది. ఆయన దూకుడుగా ఉంటారనే అభిప్రాయం ఉంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం నుంచి ప్రారంభించి.. ఇప్పటి వరకు ఆయన చేసిన రాజకీయ ప్రసంగాలన్నీ దాదాపు ఆవేశంగానే కనిపిస్తాయని అంటారు. ఆయన ఆవేశం ప్రజల కోసం పడే తపన కనిపిస్తుందని, కానీ ప్రస్తుత రాజకీయాలకు అది పనికి రాదనే వారు ఉన్నారు.

సినిమా గ్లామర్ ఉన్నా..
టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ టాప్ హీరో. ఆయనకు చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే, కేవలం సినీ గ్లామర్ మాత్రమే రాజకీయాల్లో రాణించేందుకు ఉపయోగపడదని అంటున్నారు.

ఏ మేరకు నెగ్గుకు రాగలరు
తన వద్ద డబ్బులేదని, తాను పోటీ చేస్తే కనీసం కార్పోరేటర్‌గా కూడా గెలుస్తానో కూడా తనకు తెలియదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అంత సూటిగా మాట్లాడే వ్యక్తి రాజకీయాల్లో ఏ మేరకు నెగ్గుకు రాగలరనే చర్చ సాగుతోంది. పవన్‌లో నిజాయితీ ఉన్నప్పటికీ ఆయన తీరు మాత్రం రాజకీయాలకు భిన్నంగా ఉందని అంటున్నారు.

రెండు పార్టీల పైనా ప్రభావం
పవన్ కళ్యాణ్ తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువ చర్చకు దారి తీసింది. ఏపీలో రాజకీయ శూన్యత కూడా లేదు. ఇప్పటికే ఏపీలో అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపిలో పోటాపోటీగా ఉన్నాయి. అయితే, పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే మాత్రం ఈ రెండు పార్టీల పైన ప్రభావం పడటం మాత్రం ఖాయమని అంటున్నారు.

మద్దతిచ్చి వీటిని సాధించిన పవన్ కళ్యాణ్
2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ టిడిపి-బిజెపి కూటమికి మద్దతిచ్చారు. తాను మద్దతిచ్చిన కూటమి తప్పు చేసినా నిలదీస్తానని ఆయన ప్రచారం సమయంలోనే చెప్పారు. చెప్పినట్లుగానే.. ప్రత్యేక హోదా పైన ఓసారి గళమెత్తారు. రాజధాని అమరావతిలో భూముల విషయమై.. అక్కడ పర్యటించి ప్రభుత్వం మెడలు వంచారు.

ప్రశ్నించి... ఎన్నికల బరిలోకి దిగకుండానే గెలిచారు
ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్.. అలా బయట ఉంటూనే ప్రజల కోసం సాధించవచ్చునని, నేరుగా ఎన్నికల గోదాలోకి దిగితే నష్టపోవాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బయట నుంచి మద్దతిచ్చుకుంటూ వెళ్తే ప్రజలకు కావాల్సిన దానిపై ప్రశ్నించవచ్చునని, నేరుగా ఎన్నికల బరిలోకి దిగితే.. పరిస్థితి మరోలా తయారవుతుందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్
ఇప్పుడున్న రాజకీయ నాయకులకు పవన్ కళ్యాణ్ కొంత భిన్నంగా ఉంటారని అంటుంటారు. సూటిగా మాట్లాడటం, ఆవేశంగా మాట్లాడటం, కులం రంగు పూసుకోవడానికి ఇష్టపడకపోవడం, రాజకీయ వ్యూహాలు తెలియకపోవడం.. ఓ రకంగా ఆయనకు ఇబ్బందేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications