పవన్ కళ్యాణ్ ఫీవర్: రాజధాని పరిధిలోనే 20 స్థానాల్లో!
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో 24 గంటల్లో ఒక్కసారి మారిపోయాయి. టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ జనసేన అనుకున్నది సాధించింది. ఓట్ల సంగతి దేవుడెరుగు, కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోందని అంటున్నారు. పవన్ జనసేన పార్టీని ప్రారంభించి చేసిన భావోద్వేగ ఉపన్యాసం అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రజలను కుదిపేసింది.
ఇచ్ఛాపురం నుండి తడ వరకు, హిందూపురం నుంచి ఆదిలాబాద్ వరకు పవన్ కళ్యాణ్ ప్రసంగం, జనసేన పార్టీ ప్రతి ఇంట్లో చర్చనీయాంశమైంది. దీంతో తెలంగాణలో తెరాస, కాంగ్రెస్, సీమాంధ్రలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు పవన్ ఫీవర్ పట్టుకుందంటున్నారు. తమను విమర్శించక పోవడం కొంతలో కొంత టిడిపికి ఊరట అంటున్నారు.
పవన్ జనసేన హైదరాబాద్ రంగారెడ్డితో పాటు మరో నాలుగు జిల్లాలను లక్ష్యంగా చేసుకుని ప్రచారాన్ని ఉధృతం చేయాలనుకుంటున్నారు. కెసిఆర్ కుటుంబాధిపత్యాన్ని, కాంగ్రెస్‌ను వ్యతిరేకించి అన్ని రాజకీయ పార్టీలతో పొత్తుకు సిద్ధమవుతున్నారు. పవన్ చేసిన ప్రసంగంతో రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు కుదేలయ్యారంటున్నారు.

పవన్‌పై దాడి చేసేందుకు తగిన అస్త్రాలు లేక సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు ఏం చేయలేకపోయాయంటున్నారు. కేవలం మూడు పెళ్లిళ్ల విమర్శలు తప్ప పవన్‌ను ఎదుర్కొనేందుకు సరైన అస్త్రాలు వారి వద్ద లేవంటున్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో జనసేన పార్టీ ముఖ్యులతో పవన్ సమావేశమవుతున్నారు.
ముందుగా సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రసంగించనున్నారు. అనంతరం ప్రజల నాడిని అనుగుణంగా పార్టీ పొత్తులపై యోచించనున్నారు. పొత్తులు ఉంటాయి. కాని ఏ పార్టీతో పొత్తు ఉంటుందో ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదని, అందుకే చివరి నిమిషం వరకు వేచిచూసే ధోరణిలో ఉండాలని పవన్ వర్గాలు భావిస్తున్నాయి.
రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను మట్టికరిపించే విధంగా వ్యూహాలు ఉండాలని, పవన్ అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పవన్ పార్టీ పోటీకి రంగం సిద్ధం చేస్తోంది. పొత్తుకు ముందుకు వస్తే సీట్లు పంచుకుంటామంటున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో స్ధిరపడిన ఆంధ్రులతో పాటు అభివృద్ధికాముకులైన తెలంగాణ ప్రజల సహకారంతో ఇక్కడ ఒక రక్షణ కవచంలా ఉండాలని భావిస్తోంది. సీమాంధ్రలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, బిజెపి, జై సమైక్యాంధ్రలో ఏ పార్టీతో పొత్తు ఉంటుందో ముందు తేలనుంది.












Click it and Unblock the Notifications